Chandrababu Naidu, Chandrababu Naidu Special Status, Chandrababu Naidu AP Special Status, Chandrababu Naidu Andhra Pradesh Special Status, Nara Chandrababu Naidu AP Special Statusఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర ప్రభుత్వం అస్పష్ట వైఖరితో ముందుకెళుతుండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నట్లు తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇబ్బంది లేకున్నా… ఏపీకి ఇస్తే మరో 11 రాష్ట్రాలు తమపై ఒత్తిడి తెస్తాయని భయపడుతున్న కేంద్రం వెనకడుగు వేస్తున్న విషయాన్ని కేంద్రం తాజాగా బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఎంతమేర కాలయాపన చేసినా… తన వైఖరిలో మాత్రం మార్పు రాదని చంద్రబాబు తేల్చేశారు.

పుష్కరాల కవరేజీ కోసం జాతీయ మీడియాకు చెందిన పలువురు ప్రతినిధులు విజయవాడ విచ్చేసిన నేపధ్యంలో… కమాండ్ కంట్రోల్ లో ఉన్న చంద్రబాబును కలిసిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగా… చంద్రబాబు తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రధాని సహా పలువురు మంత్రుల వద్ద తన వాదన వినిపించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే దాకా ఢిల్లీ వెళుతూనే ఉంటానని, కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు. అయినా ఏపీ ప్రజల అభీష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విభజించిన కేంద్రానికి ఆ రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. “ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజల మనోభావాలను ఢిల్లీలోని కేంద్రం పెద్దలకు అర్థమయ్యేలా చూడండి” అంటూ ఢిల్లీ మీడియాను కోరారు.