High Tension at Chandrababu Naidu's Residence as YSRCP Cadre Try to Fire Crackersఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలనమైన విజయం నమోదు చేసింది. 175 ఎమ్మెల్యే సీట్లలో 151 సీట్లలో, 25 ఎంపీ సీట్లలో 22 కైవసం చేసుకుని సంచలన నమోదు చేసుకుంది. కాసేపటి క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ నుండి ఎన్నికైన నూతన ఎమ్మెల్యేలు సమావేశమయ్యి వైఎస్ జగన్ ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆరు నెలలలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి పని చెయ్యాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

“చంద్రబాబు నాయుడు అక్రమంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యే సంఖ్య 23. చివరికు చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 23. ఫలితాలు వచ్చిన తేదీ కూడా 23. గతంలో మన పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీల సంఖ్య 3. ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఎంపీల సంఖ్య 3. దేవుడు చంద్రబాబును శిక్షించాడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?, అని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోవడంతో ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించాం. ఈ పరిణామం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమన్నారు.

“ప్రజలు విశ్వ‌స‌నీయ‌త‌కు ఓట్లు వేశారు. ప్రజలు మనపై నమ్మకం పెట్టుకున్నారు. వారి విశ్వాసాన్ని పొందాలి. ప్రజలు మనకు గొప్ప బాధ్యతను అప్పగించారు. వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. 2024లో ఇంతకంటే గొప్ప విజయం సాధించాలి. మన సమర్థతకు మద్దతుగా ఓటేసే పరిస్థితి రావాలి,” అని జగన్ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 30న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉదయం 11.40కు జగన్ ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు.