యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగాలు, వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు చాలా ఆలోచింపజేస్తున్నాయి. ఇటీవల తన తండ్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సంభాషణని నారా లోకేష్ పార్టీ నేతలతో పంచుకొంటూ, “ఇటీవల నేను ఆయనని కలిసినప్పుడు ఓ మాట అడిగాను. రాష్ట్రం పరిస్థితి చూస్తే చాలా భయమేస్తోంది. లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. 2024 ఎన్నికలలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా అనేక సమస్యలు తప్పవు కదా?” అని అడిగాను.
దానికి ఆయన చిర్నవ్వుతో “సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకోవాలి. అప్పుడే మన సమర్దత బయటపడుతుంది. 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులే ఉండేవి. 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇటువంటి పరిస్థితులే ఉండేవి. అయినా హైదరాబాద్‌ని అభివృద్ధి చేయలేదా? అమరావతిని అభివృద్ధి చేయలేదా? అనంతపురంలో కియా కంపెనీని తీసుకురాలేదా?2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే అలాగే చేస్తాను,” అని అన్నారు.
అప్పుడు నేనూ ఆయనకి ఓ మాట చెప్పాను. “నిజమే! మీకు కష్టపడటమే తప్ప ఆ కష్టం తాలూకు ఫలితాలని అనుభవించే యోగం లేదు. దేవుడు మీ తలరాత అలా రాసి పెట్టాడు. రాష్ట్రంలో ఎప్పుడు సంక్షోభం ఏర్పడినా అందరికీ మీరే గుర్తొస్తారు. అప్పుడు మీరు వచ్చి అన్ని సమస్యలని పరిష్కరిస్తారు. తర్వాత ఎన్నికలలో ఓడిపోతుంటారు. 2014లో వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. ఆ తర్వాత ప్రజలు మీ అవసరం లేదనుకొన్నారు. 2019 ఎన్నికలలో ఓడిపోయారు. వడ్డించిన విస్తరిలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు.
ఈ మూడున్నరేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ సంక్షోభంలో పడేశారు. మళ్ళీ కష్టకాలం వచ్చింది కనుక ప్రజలకు మళ్ళీ మీరే గుర్తుకొస్తున్నారు. కష్టకాలంలో వచ్చి పనిచేయడం మీకు అలవాటే. ఇప్పుడూ అదే జరుగబోతోందని చెప్పాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అవసరం చాలా ఉంది. ఆయన మాత్రమే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను,” అని నారా లోకేష్ అన్నారు.
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చేతిలో చిల్లి గవ్వలేదు. రాజధాని లేదు. రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దాంతో పెద్దగా ఆదాయం కూడా ఉండేది కాదు. పైగా విద్యుత్ కోతలతో రాష్ట్రంలో ఉన్న కొన్ని పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి.
మరో పక్క ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సంక్షేమ పధకాలు అమలుచేయక తప్పని పరిస్థితి. అభివృద్ధిపనులు కొనసాగించాల్సిన పరిస్థితి. వివిద శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు అందరూ హైదరాబాద్‌లో ఉండగా రాష్ట్రాన్ని నడిపించడం మరో పెద్ద సమస్య. మరోపక్క పక్కలో బల్లెంలా జగన్, కేసీఆర్ ఉన్నారు. ఇన్ని సమస్యలని ఎదుర్కొంటూనే చంద్రబాబు నాయుడు పాలన ప్రారంభించారు. ముందుగా విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించారు. పైసా ఖర్చు పెట్టకుండా అమరావతి కోసం రైతులని ఒప్పించి 36,000 ఎకరాలు భూసేకరణ చేయడం, నిర్మాణ పనులు మొదలుపెట్టడం, శరవేగంగా వాటిని నడిపిస్తుండటం, మరో పక్క పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించడం… మద్యలో హూద్ హూద్ తుఫాను బీభత్సం… ఇలా చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయి. అయితే నారా లోకేష్ చెప్పినట్లు సంక్షోభం పరిష్కారమైపోగానే వేరొకరు వచ్చి ఆయన కష్టఫలాలని అనుభవిస్తుంటారు. 2019 ఎన్నికల తర్వాత అదే జరిగింది. రాష్ట్రంలో మళ్ళీ సంక్షోభం ఏర్పడింది కనుక మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడి అవసరం ఏర్పడింది. అందుకు ఆయన సిద్దంగానే ఉన్నారు. కనుక ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పగ్గాలు అప్పగించాలో ఆలోచించుకోవలసింది ప్రజలే.