amaravati-shopping-festivalఎప్పుడూ సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ సారి దసరా – దీపావళి ఉత్సవాలను ‘అమరావతి ఫెస్టివల్’ పేరుతో విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసారు. అక్టోబర్ 1 నుండి 29 వరకు జరగనున్న ఈ వేడుకలో ఒకే ప్లేస్ లో దాదాపు 200కు పైగా షాపులను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అయితే ఈ ‘అమరావతి ఫెస్టివల్’ ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం… ప్రజలను అలరించేందుకు సినీ కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం.

ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల నిరంతరాయంగా మూడు గంటల పాటు సూపర్ హిట్ పాటలను ఆలపించడం, మిమిక్రీలు చేయించడం, డాన్స్ గ్రూప్ ల చేత నృత్యాలు చేయించడం వంటి కార్యక్రమాలు విజయవాడ ప్రజలను విశేషంగా అలరిస్తున్నాయి. సాయంత్ర సమయం గడిచిందంటే నిజంగానే ఒక పండగ వాతావరణం స్వరాజ్య మైదానంలో కనపడుతోంది. ఇప్పటికే ఆర్పీ పట్నాయక్, బాబా సెహగల్ వంటి సంగీత దర్శకులు, గాయకులు వచ్చి ప్రజలను అలరించి వెళ్ళగా, రాబోతున్న రోజుల్లో మరికొంత మంది సినీ సెలబ్రిటీలు విజయవాడలో ప్రత్యక్షం కానున్నారు.

విజయవాడ నగరానికి ‘సినిమాలు’ మినహా మరొక ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ ‘అమరావతి ఫెస్టివల్’ నిలిచింది. బహుశా మరో ప్రాంతంలో ఇదే కార్యక్రమం నిర్వహిస్తే… ఇంతలా సూపర్ సక్సెస్ అవుతుందో లేదో గానీ, విజయవాడలో మాత్రం ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్థానిక పరిస్థితులను గమనిస్తే… ఎక్కడలేని మాస్ ఫాలోయింగ్ ఈ ఒక్క కార్యక్రమం ద్వారా వచ్చినట్లుగా కనపడుతోంది.

బహుశా సంక్షేమ పధకాల ద్వారా కూడా ఈ రేంజ్ లో చంద్రబాబుకు ఆదరణ లభించిందో లేదో అన్నది ప్రశ్నార్ధకమే గానీ, ఈ వేడుకలో చంద్రబాబు పేరు వినపడుతున్న ప్రతిసారి, మైదానంలో ‘విజిల్స్’ మారుమ్రోగుతున్నాయి. సహజంగా పవన్ కళ్యాణ్ వంటి మాస్ హీరోల పాటలు వచ్చినపుడు వెలువడే విజిల్స్… ఇప్పుడు చంద్రబాబు పేరును యాంకర్లు ప్రస్తావించినపుడు వస్తున్నాయి. దీంతో విజయవాడలో చంద్రబాబు ఇమేజ్ ఒక్కసారిగా పెరిగినట్లయ్యింది. ఈ ‘అమరావతి ఫెస్టివల్’ స్పెషల్ ఏమిటంటే… ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి ఏడాది అంతకంతకూ ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.