Chandrababu Naidu - Rahul Gandhiకాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం దిల్లీలోని రాహుల్‌ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు, వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పు, ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు, ఐదు దశల్లో ఎన్నికల ట్రెండ్‌ ఎలా ఉంది తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే కొన్ని మీడియాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూపీఏకు తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు రావడంతో వాటిని కూడా చంద్రబాబు రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించారని కొందరు చెప్పడం విశేషం. కేసీఆర్ ఎంతమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదని, ఒక పక్క తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసి ఇంకో పక్క యూపీఏకు తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన రాహుల్ గాంధీకి చెప్పినట్టు సమాచారం.

అయితే తెలుగుదేశం వర్గాలు మాత్రం కేసీఆర్ యూపీఏలోకి వచ్చే అవకాశం లేదని, కావున అటువంటి చర్చ ఏమీ చంద్రబాబు, రాహుల్ గాంధీల మధ్య రాలేదని చెబుతున్నాయి. తాను యూపీఏలోకి రావడం గురించి మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కేసీఆర్ కోరినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ వార్తలను తెరాస నేతలు ఎవరూ ఖండించలేదు. అయితే ఎన్నికల ఫలితాలు రాకుండా కేసీఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.