chandrababu naidu about vivekananda Reddy caseవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులలో ఒకరైన గంగాధర్ రెడ్డి అనంతపురంలో తన నివాసంలో మొన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రతీ చిన్న విషయంపై మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకొనే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ గంగాధర్ రెడ్డి మృతిపై నోరు విప్పలేదు. పోలీసులు కూడా ఇంతవరకు అతని మరణానికి కారణం ఏమిటో చెప్పలేదు.

దీనిపై మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “వివేకాను హత్య చేసినవారు కరడు గట్టిన నేరస్తులు. వారు ఈ కేసు విచారణ జరుగుతుండగానే ఒక్కొక్కరి చొప్పున సాక్షులందరినీ చంపేస్తారని నేను మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. ఇదివరకు ఈ కేసులో కీలక సాక్షి శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడు. ఇప్పుడు గంగాధర్ రెడ్డి చనిపోయాడు.

వివేకానందరెడ్డి హత్య కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డిల మరణాల గురించి ఏం సమాధానం చెపుతారు? కీలకమైన ఈ కేసులో సాక్షులు ఒకరొకరుగా చనిపోతుంటే సిబిఐ ఏం చేస్తోందో అర్ధం కావడం లేదు. సాక్షులను కాపాడే సమర్దత సిబిఐకి లేకపోతే ఇక దేశాన్ని ఎవరు కాపాడుతారు? జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్లు వేసినా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వివేకానందా రెడ్డి హత్య కేసు విచారణ కూడా చివరికి అలాగే మిగిలిపోతుందేమో? ఇటువంటివి సిబిఐ విశ్వసనీయతనే ప్రశ్నార్ధకంగా మార్చుతాయని గ్రహించాలి, ” అని అన్నారు.