Chandrababu Naidu's Master Plan to Woo Voters in Election Year-ఏపీలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అధికార తెలుగుదేశమా? ప్రతిపక్ష వైసీపీనా? కింగ్ మేకర్ లా మారి సిఎం కావాలనుకుంటున్న జనసేననా? ఏమో దీనికి ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గరా లేదు గానీ, ఏ పార్టీ కా పార్టీ నేతలు, తమదే అధికార పీఠం అంటూ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ మూడింటిలో ఎక్కువ అవకాశాలు టిడిపికి ఉన్నాయన్నది బహిరంగమే.

కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుగుబావుటా ఎగురవేస్తూ ప్రజలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో, ‘బ్రాండ్ బాబు’కు మసక బారిందేమో అన్న సంకేతాలు వ్యక్తం కాగా, అమరావతి బాండ్ల వ్యవహారంలో చోటు చేసుకున్న ఆర్ధిక వ్యవహారాలతో “బ్రాండ్ బాబు”పై ఓ స్పష్టత వచ్చేసినట్లేనని, ఇదే రీతిన కొనసాగితే, వచ్చే ఎన్నికలలో విజయం తధ్యం అన్న మాటలు తెలుగు తమ్ముళ్ళ నుండి వినపడుతున్నాయి.

కేంద్రంపై ఎదురుతిరిగిన నేతగా బాబు పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. మరి అలాంటి బాబుపై నమ్మకం పెట్టుకుని అంచనాలకు మించి పెట్టుబడులు అమరావతిలో పెట్టడానికి ముందుకు రావడంపై ఖచ్చితంగా ‘బ్రాండ్ బాబు’ మంత్రం పనిచేసినట్లేనని టిడిపి కార్యకర్తలు, అభిమానులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికలలో రాబోయే ఫలితాలకు నిదర్శనమే ఈ ‘బ్రాండ్ బాబు’ మంత్రంగా అభివర్ణిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.

స్టాక్ మార్కెట్ లో జరిగిన ఈ పరిణామాలు ఖచ్చితంగా జగన్, పవన్ లను కుదేలు చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ పక్కన రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున అవినీతి విమర్శలు చేయడంలో జగన్, పవన్ ల ద్వయం చాలా గట్టిగా పనిచేస్తోందన్నది బహిరంగమే. కానీ వాటిని బేఖాతరు చేస్తూ పెట్టుబడిదారులు ముందుకు వస్తుండడంతో, వీరిద్దరూ సరికొత్త మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.