chandrababu vajpeyiహైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందడం వెనుక చంద్రబాబు నాయుడు కృషి ఎంత వుందో, అప్పటి ఏపీలో రహదారుల అభివృద్ధి వెనుక నాటి ప్రధాని వాజ్ పేయి హస్తం కూడా అంతే ఉందన్నది వాస్తవం. అంతేగాక, ప్రపంచ దిగ్గజాలు ఏపీలో పర్యటించడం వెనుక వాజ్ పేయి సహకారం మరువలేనిది. ఏపీలో చంద్రబాబు – ఢిల్లీలో వాజ్ పేయి కాంభినేషన్ చాలా విజయవంతమైనదని వెంకయ్య నాయుడు వంటి వారు కూడా పలు సందర్భాలలో కొనియాడారు. అంతటి వాజ్ పేయి చేసిన కృషిని చంద్రబాబు బహుశా మరచినట్లు లేరు. అందుకనే ఈ రోజు మంగళగిరిలో శంకుస్థాపన చేసిన ‘ఎయిమ్స్’కు వాజ్ పేయి పేరును పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు.

‘ఎయిమ్స్’కు ముందు ‘అటల్’(ఏ)ను జత చేర్చాలన్న ప్రతిపాదనలు తన వద్దకు కూడా వచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక, ఎయిమ్స్ విశేషాలకు వస్తే, 200 ఎకరాల్లో దాదాపు 1618 కోట్ల వ్యయంతో 900 పడకలు గల ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ‘ఎయిమ్స్’ను మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.