Chandrababu kuppam tour 2024లో సార్వత్రిక ఎన్నికలలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశం చాలా కీలకంగా మారింది. గడిచిన ఎన్నికలలో టిడిపి, జనసేన విడివిడిగా పోటీ చేసి జగన్ కు మార్గం సుగమం చేయడంతో, ఈ సారి మళ్ళీ వీరిద్దరూ చేతులు కలుపుతారా? లేదా? అన్నది పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

పొత్తులు చివరి నిముషంలో కాకుండా ముందు నుండే పెట్టుకుంటే ప్రజలకు ఓ స్పష్టత ఇచ్చిన వారవుతారని భావిస్తున్న నేపధ్యంలో… ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తోన్న చంద్రబాబుకే ఈ ప్రశ్న ఎదురయ్యింది. వచ్చే ఎన్నికలలో టిడిపి – జనసేన కలిసి పోటీచేస్తాయా? అని ప్రశ్నించగా…

‘నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావంటే, ఆమె కూడా నిన్ను ప్రేమించాలి కదా’ అంటూ చంద్రబాబు చమత్కరించారు. కార్యకర్తలను ఉత్సాహపరిచిన ఈ మాటలలో అంతరార్ధం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఇరుపక్షాలు ఒక్క తాటిపైకి వస్తే పొత్తు ఉంటుందన్న ‘హింట్’ను చంద్రబాబు ఇచ్చారు.

ఒంటరిగా పోటీ చేసే సత్తాను ఇంకా జనసేన కూడా కూడగట్టుకోలేదు గనుక, టిడిపితో పొత్తుకు మించిన మంచి అవకాశం జనసేనకు లభించదు. అందులోనూ ప్రస్తుత జగన్ పరిపాలనకు చరమగీతం పాడాలంటే, ప్రతిపక్షాలు ఏకం కావాల్సిందే. లేని పక్షంలో అది ప్రస్తుత వైసీపీ సర్కార్ కు పూర్తి అనుకూలంగా మారుతుంది.

అయితే ముందుగా ఈ పొత్తుపై ప్రకటన వస్తే, ముద్రగడ ద్వారా మరో పార్టీని పెట్టించి కాపు సామాజిక ఓట్లు చీల్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. దీనిని చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకం. ప్రతిపక్ష ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవడమే బాబు ముందున్న అసలు సవాల్!