Chandraabu Naidu Challenge to YSRCPరాజకీయ చాణక్యుడిగా చంద్రబాబు నాయుడుకున్న పేరు తెలియనిది కాదు. అలా చక్రం తిప్పే బాబు గారు కూడా గడిచిన నాలుగేళ్ళుగా కాస్త మౌనం వహిస్తూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డిఫెన్స్ లోనే ఉంటూ వచ్చారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జగన్, పవన్ వంటి వారు విరుచుకుపడుతున్న సమయంలో… వారికి చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచించకపోతే ఇక బాబు గొప్పతనం ఏముంటుంది? అందులో భాగంగానే తాజాగా వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు.

స్పీకర్ చేతిలో ఉన్న వైసీపీ ఎంపీల రాజకీయం తెలియనిది కాదు. ఆ రాజీనామాలు ఆమోదిస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని బిజెపి, వైసీపీలు వేస్తున్న డ్రామాలు విదితమే. నిజానికి ఎన్నికలు రావడం టిడిపిని ఇష్టం లేదు. కానీ రాజకీయం అక్కడే ఉందన్న విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు, ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అంతేకాదు, ఎన్నికలు జరిగితే ఆ స్థానాలను కూడా టిడిపి వశం చేసుకుంటుందని అన్నారు.

రాజకీయాలలో కావాల్సింది నిబ్బరం, మనోధైర్యమే. దానినే బాబు గారు ప్రదర్శించారు. దీంతో వైసీపీ అండ్ కో డిఫెన్స్ లో పడక తప్పదు. ఎన్నికలు వస్తే బీరాలు పోతున్న వైసీపీకి, బిజెపికి ఎన్ని ఓట్లు వస్తాయో కూడా తేలిపోతుందని చంద్రబాబు విసిరిన సవాల్ బిజెపిని ఇరకాటంలో పెట్టిందనే చెప్పవచ్చు. ఇదంతా ఓ డ్రామాగా అభివర్ణించిన చంద్రబాబు, ఈ రాజీనామాలు ఆమోదం కావు, ఉప ఎన్నికలు రావు అన్న కోణాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళితే మానసికంగా టిడిపికి అనుకూలంగా మారుతుంది.