Chandrababu Naidu Answers KCR in Slightly Tough but His Usual Assertive Toneసాంఘిక సంక్షేమ పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తూ తీసుకొన్న నిర్ణయానికి క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందన టీడీపీ నేతలు, క్యాడర్ లో జోష్ నింపుతుంది. సరైన సమయంలో చేసిన సరైన ప్రకటన వల్ల ప్రభుత్వానికి బాగా మైలేజ్ వచ్చిందని ఇది వచ్చే ఎన్నికలలో గణనీయమైన ప్రభావం చూపించబోతుందని వారు చెబుతున్నారు. వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.1000 వంతున ఇస్తున్న పింఛన్‌ను రూ.2000 చేశారు.

వికలాంగులకు రూ.1500వంతున ఇస్తున్న మొత్తాన్ని రూ.3000 చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఇటువంటి పింఛన్లు పొందుతున్న వారు 54లక్షల మంది ఉన్నారు. కొత్తగా మరో 3లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్లు కేవలం 200 మాత్రమే ఇచ్చేవారు. దీనితో చంద్రబాబు దాదాపుగా పది రెట్లు పెంచినట్టు అయ్యింది. పింఛన్లను ఐదేళ్లలో రెండు దఫాలు పెంచడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

పెంచిన పింఛన్లను పండగ వాతావరణంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకూ ప్రతి గ్రామం, వార్డులో లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని స్వయంగా చేతికి అందచేయాలని అధికార వర్గాలను ఆదేశించారు. వారికి భోజనం పెట్టి మరీ ఇవ్వాలని, దీనివల్ల వారిని ఆదరంగా చూసుకొన్నట్లు అవుతుందని నిర్ణయించారు. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించారు.

జగన్ ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క, కేసీఆర్ మరోపక్క ప్రభుత్వంపై బురద జల్లుతున్న సమయంలో ఎన్నికలకు ముంది తెలుగుదేశం శ్రేణులలో ఒకింత నిరాశ ఆవహించింది. ఈ సమయంలో వచ్చిన ఈ ప్రకటన వారికి నూతన ఉత్తేజం కలిగించింది. ఇదే ఊపులో మిగిలిన రైతు రుణ మాఫీ వాయిదాలను చెల్లించండం, డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకం వంటివి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందే ప్రకటించి ఇప్పుడున్న ఒప్పును కొనసాగించాలని చూస్తున్నారు చంద్రబాబు.