chandra-babu-naidu-vijayawada-call-money-caseవిజయవాడలో వెలుగు చూసిన ‘కాల్ మనీ’ వ్యవహారం స్థానిక తెలుగుదేశం నేతల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులలో ఒకరైన శ్రీకాంత్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న పెనమలూరు శాసన సభ్యుడు బోడే ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై కూడా అభియోగాలు వస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించి, ‘కాల్ మనీ’ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

రాజకీయ నాయకులు చేసే ఇలాంటి ప్రకటనలను పక్కన పెడితే… పెనమలూరు నియోజకవర్గపు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రస్తుతం విదేశీ టూర్ లో ఉన్నారు. అది కూడా ‘కాల్ మనీ’ కేసులో నిందితుడిగా పరిగణిస్తున్న శ్రీకాంత్ తో పాటు వెళ్ళడంతో ప్రసాద్ పై వ్యక్తమవుతున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది. అయితే ‘స్నేహం’ వేరు… ‘వ్యాపారం’ వేరు… శ్రీకాంత్ చేస్తున్న వ్యాపారంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని తనకు అంటూ బోడే ప్రసాద్ సర్ది చెప్తున్నా.., బోడే, బుద్ధాలపై ప్రజల నుండి పెద్ద ఎత్తున అభియోగాలు వస్తుండడంతో ఈ కేసులో తెలుగుదేశం నేతలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘విజయవాడకు బయల్దేరాను… వచ్చి రావడంతోనే అన్ని విషయాలు వివరంగా చెప్తానని’ బోడే ప్రసాద్ ఓ మీడియాకు ఇచ్చిన వివరణలో తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు కావడంతో, తమ అధికారం, పలుకుబడి ఉపయోగించి భావన సామాన్య ప్రజల్లో బలంగా ఉండడంతో.., ఈ కేసులో నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది. ఈ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని, అధికార, ప్రతిపక్ష నేతలన్న తేడాలు లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా డీజీపీ, విజయవాడ పోలీస్ కమీషనర్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు సిఎం. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలో పెడతారని ప్రజలు ఆశిస్తున్నారు.

నిజానికి ఈ కేసులో ఒక్క తెలుగుదేశం నేతలే కాదు, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్టుమెంటుకు సంబంధించిన ప్రముఖులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ… ఈ “కాల్ మనీ” వ్యవహారంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ఉంది.