ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ లో తలపడ్డ ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఫైనల్ వరకు చేరుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే… ఇండియాతో ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ‘-3’ రన్ రేట్ లోకి పాక్ వెళ్ళిపోవడంతో, ఇక టోర్నీ నుండి అవుట్ అయినట్లే భావించారు. కానీ అనూహ్యంగా వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి అగ్ర జట్లకు షాక్ ఇస్తూ ఫైనల్ వరకు దూసుకువచ్చారు.

అంతేనా… ఫైనల్లో టీమిండియాకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం… పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ అదిరిపోయే స్థాయిలో ఉండడమే. దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లకు తొలుత బ్యాటింగ్ అప్పగించి 200 పరుగుల దరిదాపుల్లోనే ఆలౌట్ చేయడమంటే సాధారణ విషయం కాదు. తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడం, ఆ తర్వాత వాటిని చేధించడంతో పాకిస్తాన్ జట్టు ఫైనల్స్ వరకు విజయవంతంగా చేరింది. అయితే ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి 338 పరుగుల భారీ స్కోర్ ను కూడా సాధించింది.

ఈ భారీ స్కోర్ ను టీమిండియా ఖచ్చితంగా చేధిస్తుందని అంతా భావించారు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయమన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా… ఇలా అరవీర భయంకర బ్యాట్స్ మెన్లు ఉండడంతో… కనీసం లక్ష్య చేధన దిశగా అడుగులు వేస్తుందని అంచనాలు వేసారు. కానీ పిచ్ లో జరిగింది మరొకటి. పాకిస్తాన్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాట్స్ మెన్లు వణికిపోయారు.

మహ్మద్ అమీర్ వేసిన ఫాస్ట్ బౌలింగ్ కు బ్యాట్ అడ్డు పెట్టాలంటే… ఒకటికి రెండు సార్లు బ్యాట్స్ మెన్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందంటే… ఏ రేంజ్ లో పాక్ బౌలర్లు చెలరేగిపోయారో ఊహించుకోవచ్చు. ఒక్క ఫాస్ట్ బౌలర్స్ యేనా… స్పిన్ బౌలింగ్ ను ఆడడంలో సిద్ధహస్తులుగా పేర్కొనే టీమిండియా బ్యాట్స్ మెన్లను కొత్తగా జట్టులోకి వచ్చిన 18 ఏళ్ళ స్పిన్నర్ కూడా భయపెట్టాడు. దీంతో ఒకటి మాత్రం క్రికెట్ పండితులకు స్పష్టమైంది… పటిష్టమైన బౌలింగ్ ఉంటే… ఎంతటి బ్యాట్స్ మెన్లు కూడా ఏం పీకలేరన్న విషయం అవగతమైంది.