Champions Trophy 2017, Ind vs Pakఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్తాన్ జట్టు చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూసిన టీమిండియా క్రికెటర్లపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాదిన పలు చోట్ల క్రికెటర్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అలాగే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు గానూ కెప్టెన్ విరాట్ కోహ్లిపై అయితే ఒంటి కాలుపై లేగుస్తున్నారు. మరికొందరు అయితే ఓ అడుగు ముందుకేసి కెప్టెన్సీకి రాజీనామా చేయాలని సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు.

అంతకుముందు వరకు కోహ్లి అంతటోడు మరొకడు లేడు అని పొగిడిన నోళ్లే, మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి కెప్టెన్సీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలా అభిమానులను బాధించిన అంశం ఏమిటి? అంటే… ఖచ్చితంగా ఓటమి మాత్రం కాదు… ఓడిన విధానం… అని చెప్పవచ్చు. ఒక మ్యాచ్ అన్నాకా, ఏదొక జట్టు గెలవడం సహజం. కానీ మరో జట్టు పోటీనిచ్చే విధంగా పోరాటపటిమను ప్రదర్శించిందా లేదా అన్నది కీలకంగా మారుతుంది. టీమిండియా పాలిట ఇదే శత్రువైంది.

హార్దిక్ పాండ్య మినహా ఒక్క బ్యాట్స్ మెన్ కూడా కాసేపు క్రీజులో నిల్చుందామన్న ఆలోచనలు కూడా చేయకపోవడం అభిమానులు జీర్ణించుకోలేని అంశంగా మారింది. పేరు గొప్ప… ఊరు దిబ్బ… అన్న చందంగా బ్యాటింగ్ లైనప్ లో మాత్రం దిగ్గజాలు పేర్లు చూసి మురిసిపోగా, వారంతా కలిసి ముప్పేట ముంచేయడం ఫ్యాన్స్ కు మనోవేదనను మిగిల్చింది. బహుశా పాక్ లక్ష్యానికి చేరువగానో, కనీసం 300 పరుగుల దరిదాపుల్లోకి వచ్చినా… అభిమానుల ఆగ్రహం ఇంతలా పెల్లుబూకేది కాదని చెప్పవచ్చు.

ఈ ఒక్క ఓటమితో మిడిల్ ఆర్డర్ లో ఉన్న యువరాజ్, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల స్థానాలు తారుమారయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా యువీ మళ్ళీ చోటు దక్కించుకుంటారా? అనేది ప్రశ్నార్ధకమే! తదుపరి సిరీస్ కు ధోనిని విశ్రాంతినివ్వడంతో, ధోని స్థానంలోకి వచ్చిన పంత్ చెలరేగితే, నెమ్మదిగా ధోనిని కూడా పక్కన పెట్టడం లాంచనమే! ఇక స్వార్ధపూరితమైన జడేజా బ్యాటింగ్ తో ఫ్యాన్స్ మరింత రగిలిపోతున్నారు. జడేజాను కూడా తప్పించాలనేది అభిమానుల డిమాండ్.