chalo vijayawada govt employees ‘మాటలు కోతలు దాటతాయి, చేతలు చెప్పులు దాటవు’ అన్నది ఓ తెలుగు సామెత. సరిగ్గా ఇదే సూక్తిని పలు మీడియా సంస్థలు అవలంభిస్తున్నట్లుగా కనపడుతోంది. ఇందుకు ఉదాహరణగా నేడు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిలుస్తోంది.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షల సంఖ్యలో ఉద్యోగులు హాజరు కావడం అనేది సాధారణ విషయం కాదు. ఈ ఉదంతం ప్రభుత్వానికి గట్టి షాక్ ని ఇచ్చిందనే చెప్పవచ్చు. అయితే దీనిని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఏ మాత్రం కవరేజ్ ను ఇవ్వలేదు.

కట్నాల గురించి తెగ లెక్చర్లు ఇచ్చే మీడియా సంస్థలు, నేడు ఉద్యోగులు పడుతోన్న బాధలను ప్రసారం చేయడానికి భయపడిపోయాయి. వైసీపీ సర్కార్ కు అనుకూలంగా ఉండే వార్తలను మాత్రమే ప్రసారం చేయడం అలవాటైన సదరు ఛానెల్స్ కు అసలు ఈ ఉద్యమం తారసపడినట్లుగా లేదు.

ఈ విషయం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. జగన్ సొంత మీడియా సంస్థ అయిన సాక్షి అయితే కనీసం ఓ వార్త మాదిరి కూడా చెప్పడానికి సాహాసం చేసుకోలేనంత డిఫెన్స్ లోకి వెళ్లిపోగా, రఘురామకృష్ణంరాజు పిలుచుకునే ‘సాక్షి 9’ ఛానల్ అయితే ఒక వార్తలాగా చెప్పి వదిలేసారు.

వీరికల్లా కావాల్సింది ఏమిటంటే… చిరంజీవి వంటి సెల్రబ్రిటీలలో జరిగే విషయాన్ని రోడ్డుకు ఈడ్చడానికో లేక ఏ క్రిమినల్ అయినా ఎక్సక్లూజివ్ గా ఇంటర్వ్యూలు ఇస్తేనో, ముందుంటారు గానీ, ప్రజా సమస్యలను ఫోకస్ చేయడానికి కాదన్న విషయం మరోసారి స్పష్టమయింది.

ఈ ఉద్యమాన్ని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కవర్ చేస్తూ సంచలనంగా ప్రకటించాయి గానీ, తెలుగు మీడియా సంస్థలు మాత్రం రెండుగా విభజన జరిగి, జగన్ అనుకూల – ప్రతికూలగా మారిపోయిన వైనం నేడు కళ్ళ ముందు సాక్షత్కరింపబడింది.

ఇక ముందు సదరు మీడియా ఛానల్స్ ఏదైనా నీతి సూత్రాలు వల్లిస్తే వీక్షకులు నవ్వుకునే విధంగా పరిస్థితి మారిపోయింది. కనీసం జరిగిన సంఘటనను ప్రసారం చేసుకోలేనంత దయనీయ స్థితిలో మీడియా వర్గాలు ఉంటే, ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎలా తెలిసివస్తాయి?