Why-is-Chiranjeevi-Highlighted-in-Tamil-Nadu-Politicsసినీ వేడుకలపై భారీ ప్రసంగాలు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతటి ప్రతిభావంతులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ అనర్గళంగా మాట్లాడితే ఎంత చూడముచ్చటగా ఉంటుందో… ఇదే సమయంలో తడబడుతూ ప్రసంగిస్తే… అంతే ఇబ్బందికరంగా ఉంటుందని “చలో” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరూపించింది. నాగశౌర్య గురించి చెప్పడానికి మెగాస్టార్ పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావన్న వైనం, సదరు ఈవెంట్ లో చిరు ప్రసంగాన్ని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

ఇలాంటి ప్రసంగాలను మెగాస్టార్ రాజకీయ వేదికలపై చాలానే చూసాం గానీ, సినీ వేడుకలపై మాత్రం బహు అరుదు. చెప్పడానికి విషయం లేనపుడు మెగాస్టార్ అంతటి వ్యక్తి కూడా తడబాటుకు గురికాక తప్పదని నిరూపించారు. గత రెండు, మూడేళ్ళుగా పెద్ద హీరోల సినిమాలు ఎంతటి హిట్ అవుతున్నాయో, చిన్న సినిమాలు కూడా అదే స్థాయిలో ఆడుతున్నాయని పలు సినిమా పేర్లు చెప్పిన చిరు… అందులో అక్కినేని అఖిల్ “హలో”ను కూడా చేర్చేసారు. బహుశా ఇండస్ట్రీకి కొత్త రక్తం వచ్చిందని చెప్పాలనుకున్నారో ఏమో గానీ, ‘హలో’ విషయంలో టంగ్ స్లిప్ అయ్యారు.

అంటే మెగాస్టార్ దృష్టిలో అఖిల్ చిన్న హీరోనా? లేక ‘హలో’ చిన్న సినిమానా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. నాగశౌర్య గురించి ఏదో ప్రశంసించాలన్న ఉద్దేశంతో ఏదో చెప్పబోగా, అది కాస్త అక్కినేని అఖిల్ సినిమాపై ప్రభావితం చూపింది. ఈ స్పీచ్ లో… కొత్త రక్తం… నూతన రక్తం… అంటూ వెంటవెంటనే ఒకే అర్ధం వచ్చే పదాలను వినియోగించి నెటిజన్లకు నవ్వులను తెప్పించారు. సాధారణంగా తన స్పీచ్ లతో నవ్వించడం బాలకృష్ణ వంతు కాగా, ఈ సారి మెగాస్టార్ దానిని భర్తీ చేసారు.