ys jagan mohan reddy No Confidence Motionఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అసలు సిసలు మజాను వీక్షకులకు పంచుతోంది. భారీ యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్స్ ఇవ్వలేని “కిక్”ను ఏపీ అసెంబ్లీ ఇస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య వినపడుతున్న డైలాగ్స్ సినిమాలను మించిపోయే విధంగా ఉండడం, ఎటువంటు సెన్సార్ లేకుండా ‘లైవ్’లో దీన్నంతా ప్రజలు వీక్షించడంతో కావాల్సినంత ‘ఎంటర్టైన్మెంట్’కు నిలయంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా “సవాళ్ళు – ప్రతిసవాళ్ళు”తో జనరంజకంగా మారిన సభలోని కొన్ని ముఖ్య ఘట్టాలు…

చంద్రబాబు సవాల్ :
“వీటీపీఎస్, కృష్ణపట్నం కొత్త యూనిట్, భూముల విషయంలో చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను అసెంబ్లీకి రాను, నిరూపించకపోతే మీరు కూడా ఆ పని చేయగలరా?” అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటీపీఎస్ అంశం కోర్టు పరిధిలో ఉంది కనుక, దీనిని పక్కనపెట్టి మిగతా ఆరోపణలనైనా నిరూపించుకోవాలని, ఆరోపణలు నిరూపించకుంటే జగన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఈ హౌస్ లో సభాసంప్రదాయాలు లేవు, ఇష్టానుసారం ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారని, నిబంధనలు పాటించడం లేదని ఆయన మండిపడ్డారు.

జగన్ సవాల్ :
“మీపై ఉన్న ఆరోపణలపై సీబీఐతో విచారణకు ఒప్పుకునే దమ్మూ, ధైర్యం మీకు ఉన్నాయా? లేవా?” అంటూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రతిసవాల్ విసిరారు. ఓఆర్ఆర్ లో ఆరోపణలు వస్తే వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని, అదే మాదిరి సీబీఐ విచారణ వేసుకునే దమ్ము చంద్రబాబుకు లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని జగన్ చేసిన తీవ్ర పదజాలం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది.

అచ్చెన్నాయుడు సవాల్ :
“జగన్… నీకు దమ్ము, ధైర్యం ఉంటే… నువ్వు మగాడివైతే… చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలి” అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, లేనిపోని ఆరోపణలు చేయడం జగన్ కు అలవాటై పోయిందని, సోలార్ అగ్రిమెంట్ లో ఇంతవరకూ టెండర్లే పిలవలేదు, అప్పుడే కుంభకోణం జరిగిందని, 7 వేల కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారని, ఈ ఆరోపణలను నిరూపించుకోవాలని, తాను చేసిన ఛాలెంజ్ ని దమ్ముంటే జగన్ స్వీకరించాలని అచ్చెన్నాయుడు అన్నారు.