Chadhipiralla Adinarayana Reddy joining BJPఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం ఆయన హైదరాబాద్ లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసి పార్టీలో చేరే విషయమై సమాలోచనలు జరిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాయి నుండీ ఆయన టీడీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన టీడీపీలో చేరారు. అనంతరం మంత్రి పదవి పొందారు. అప్పటినుంచి జగన్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో అప్పటి ప్రతిపక్ష పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిని ఓడించడంలో కీలకపాత్ర పోషించారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించిన ఆదికి చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. ఆయనను కాదని జమ్మలమడుగు టిక్కెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. దాంతో ఆదినారాయణరెడ్డి అయిష్టంగానే ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికలలో ఇద్దరూ ఓడిపోవడం గమనార్హం. జగన్ పార్టీ తో ఉన్న ఇబ్బందుల కారణంగా కక్షసాధింపు ఉంటుందని భావించిన ఆది సేఫ్టీ కోసం బీజేపీ పంచన చేరుతున్నారు.