Pawan Kalyan - pentapati pulla rao - janasenaఒకపక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమానాలో జరిగిన అవినీతి వెలికితీయడానికి అంటూ ఒక కేబినెట్ సబ్- కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నియమిస్తే, కేంద్రం కూడా చంద్రబాబును ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసింది మీరేనా? అని సామాజికవేత్త, జనసేన నాయకుడు పెంటపాటి పుల్లారావును కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నిఘా విభాగం ప్రశ్నించింది.

‘‘ఆ ఫిర్యాదు మీరే చేశారా? లేదా అనేది ధ్రువీకరించండి. మీ ఆరోపణలకు ఆధారాలు నిరూపిస్తారా? దర్యాప్తు అధికారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని లేఖ ద్వారా కోరింది. ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో నిబంధనల ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 15 రోజుల్లో పుల్లారావు ప్రతిస్పందన తెలియజేయాలని అనంతరం కేంద్ర మంత్రిత్వశాఖకు పంపుతామని తెలిపింది. లేదంటే ఫిర్యాదును విస్మరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

పెంటపాటి పుల్లారావు గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ లో అనేక కేసులు వేసిన సంగతి తెలిసిందే. మీడియాలో జనసేనకు అనుకూలంగా వ్యాసాలు రాస్తున్న ఆయనను పవన్ కళ్యాణ్ అప్పట్లో పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు అయితే ఆయనకు ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కలేదు. ఇది ఇలా ఉండగా కేంద్రం నుండి వచ్చిన లేఖకు పుల్లారావు స్పందిస్తూ… ఫిర్యాదు చేసింది తానేనని పేర్కొంటూ తిరుగు లేఖ రాసినట్లు తెలిపారు.