Central Government sent a Committee to investigate on titli effected srikakulamతిత్లీ తుఫానుతో కకావికలమైన శ్రీకాకుళంను ఆదుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండు సార్లు లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు. పార్టీ ఆఫీసు శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్ కు కనీసం ఇటు రావాలని కూడా అనిపించలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డి శ్రీకాకుళాన్ని మునుపటి స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

ఈ సమయంలో ‘తిత్లీ’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్‌కు చేరుకున్న ఎనిమిది మంది సభ్యుల బృందం.. తుపానుతో అతలాకుతలమైన ప్రాంతాలను ఫోటో ఎగ్జిబిషన్‌ ద్వారా తిలకించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, వజ్రపుకొత్తూరు, పలాస, కవిటి, మెళియాపుట్టి, మందస, సోంపేట, కంచిలి మండలాల్లో బృంద సభ్యులు పర్యటించనున్నారు. అయితే విపత్తు సంభవించిన ఇన్ని రోజులకు వచ్చి చూస్తే వారికి ఏం తెలిస్తుందని అక్కడి స్థానికులు అంటున్నారు.

చాలా వరకు పునరుద్ధరించాకా ఇప్పుడు పర్యటించి ఏం లాభం? ఏదో నామమాత్రంగా రిపోర్టు ఇచ్చేసి, అరకొరగా నిధులు ఇస్తే ఎవరికీ ప్రయోజనం? ఇప్పటికైనా కేంద్రం ఆదుకుంటుందా లేక కంటితుడుపేనా? అని అందరి మదిలో వేధిస్తున్న ప్రశ్న. పైగా వారు ఇచ్చే అరకొర నిధుల గురించి బాకా ఊదడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.