Singapore consortiumఅవును… కనివినీ ఎరుగని రాజధాని కోసం తమ వంతులో భాగంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన కేంద్రం, గత రెండేళ్ళ నుండి ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి గానూ 2050 కోట్లు కేటాయించారు. ఈ 2050 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మించుకోండి… అంటూ తాజాగా కేంద్రం తన “గొప్ప మనసు”ను చాటుకుంది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో కేంద్రం… రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారుల ముందు వితండ వాదన చేసిన వైనం వెలుగు చూసింది.

విభజనతో ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇది. ఇక రాజధాని నిర్మాణ విషయంలో ‘మీ చావు మీరు చావండి’ అంటూ పరోక్ష సంకేతాలు పంపారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై సింగిల్ పైసా విడుదల చేయలేమని స్పష్టం చేసింది. విభజన చేసి కాంగ్రెస్ ఒక రకంగా ద్రోహం చేస్తే… అసలు ఎదగనివ్వకుండా బిజెపి తమ వంతులో భాగంగా పూర్తి కృషి చేస్తోంది. బహుశా సహాయ సహకారాలు ఈ స్థాయిలో ఉంటారని ఏపీ ప్రజలు కూడా ఊహించి ఉండకపోవచ్చు.

మరి 2050 కోట్లతో దేశంలో ఏ రాజధానిని నిర్మించారో కూడా సూచనలు చేస్తే… దానిని ఆదర్శంగా తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి కూడా ముందు అడుగులు వేసేవారు కదా! బహుశా దేశంలో కాకపోయినా… ప్రపంచంలోనైనా 2050 కోట్లతో ఒక రాజధానిని ఎలా నిర్మిస్తారో చెప్తే… చంద్రబాబు గారు తమ సొంత ఖర్చులతో వెళ్లి మరీ నేర్చుకు వచ్చేవారు కదా! ఇంతోటి సహకారానికి గానూ ఏ మాత్రం సిగ్గు పడకుండా రాష్ట్ర స్థాయి నేతలు ఏపీకి అంత చేసింది, ఇంత చేసింది అంటూ ప్రచారం చేసుకోవడం… బహుశా బిజెపి నాయకులకు మాత్రమే చెల్లుబాటు అవుతుందేమో..!