Center - YS Jagan
చంద్రబాబు నాయుడు సమయంలో ఓటుకు నోటు కేసు, తునిలో ట్రైన్ తగలపెట్టిన కేసు వంటి పలు సంఘటనలలో ఇంటెలిజెన్సు వైఫల్యం స్పష్టంగా ఉంది. దీనితో ఆ శాఖను బలోపేతం చేసుకోవడానికి తెలంగాణాలో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి ఇంటలిజెన్స్ చీఫ్ ను చేద్దామని ప్రయత్నించారు ముఖ్యమంత్రి జగన్. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నారు. అయితే కేంద్రం దీనికి అడ్డుపుల్ల వేసింది.

స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దాంతో.. ఆయన మళ్లీ తెలంగాణలోనే ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల పాటు.. ఆయన తెలంగాణలో.. ఐజీగా చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఏపీలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వెళ్లేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం ఒప్పుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన లాబీయింగ్ పని అవ్వలేదు. నిబంధనలు కారణంగా చెబుతున్నప్పటికీ జగన్ ఏది కావాలంటే అది చేసే పరిస్థితి లేదని చెప్పడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరోవైపు జగన్ కేసులలో నిందితురాలిగా ఉండి జైలుకు కూడా వెళ్లొచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెను వెంటబెట్టుకుని అమిత్ షా దగ్గరకు తీసుకుని వెళ్లారు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పటివరకూ ఆమె గురించి కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌ ను ఒప్పుకోకపోవడంతో ఆమె డిప్యూటేషన్‌ పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం అనుమతి ఇస్తే ఆమెకు సీఎంఓలో పెద్ద పదవి గారంటీ అంటున్నారు.