amaravati outer ring roadనవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ కేంద్రంగా నిర్మితం కానున్న 180 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ కు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అన్నీ అనుమతులు పూర్తయ్యాయి. ఇక, బాధ్యతంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టడానికి, అవసరమైన భూములను సేకరించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఒక్క భూసేకరణకే దాదాపు 4000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడంతో పాటు, రైతుల నుండి భూములను తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారనుంది. అయితే, “వీలైనంత త్వరగా భూములను తీసుకుని ఇస్తే, పనులు ప్రారంభిస్తామని” మరోపక్క కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

ఇప్పటికే రాజధాని కోసం దాదాపు 33 వేల ఎకరాల భూమిని సేకరించడంతో, ఇపుడు రింగ్ రోడ్ కోసం కొత్తగా భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మొత్తంగా 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 8 లైన్లతో దాదాపు 20 వేల కోట్లు బడ్జెట్ తో నిర్మాణం కానున్న ఈ రింగ్ రోడ్ కు అంతర్జాతీయ అవుట్ లుక్ తీసుకు రానుంది.