celkon company invests 250 crores in ap and telanganaస్వదేశీ మొబైల్ సంస్థ అయినటువంటి “సెల్ కాన్” రాబోయే ఆరు మాసాల్లో ఏపీ, తెలంగాణాలలో దాదాపు 250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు, ఆ సంస్థ చైర్మన్ & ఎండీ వై.గురు తెలిపారు. తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొత్త టాబ్లెట్ ప్రారంభించిన సందర్భంగా “పెట్టుబడులు మరియు భవిష్యత్తు ప్రణాళికల” గురించి పలు కీలక ప్రకటనలు చేసారు సదరు సంస్థ ఎండీ.

250 కోట్లలో 100 కోట్లు హైదరాబాద్ లోని ప్లాంట్ ఉత్పాదకతను పెంచేందుకు కేటాయించగా, మిగతా 150 కోట్లు తిరుపతిలోని ప్లాంట్ కొరకు ఖర్చు చేయనుంది. ఈ ఏడాది జూన్ లో హైదరాబాద్ ప్లాంట్ ప్రారంభించగా, గత నెలలో దాదాపు 2.90 లక్షల మొబైల్స్ తయారయ్యాయి. అలాగే తిరుపతి ప్లాంట్ కూడా పూర్తయ్యే సమయానికి నెలకు దాదాపు 10 లక్షల మొబైల్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం నెలకు 5 లక్షల ఫోన్లను అమ్ముతున్నట్లుగా ప్రకటించారు.

మొబైల్ రంగంతో పాటు టెలివిజన్ విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. మరో దేశీయ కంపెనీ మైక్రోమాక్స్ మొబైల్ తో పాటు టీవీ రంగంలోనూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీవీ రంగంలో ఇంకా 30 శాతం మార్కెట్ కు అవకాశం ఉందని, అందుకే ప్రముఖ చైనా సంస్థతో కలిసి టెలివిజన్ లను ఉత్పత్తి చేస్తామని, కొద్ది వారాలలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని ‘సెల్ కాన్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ తెలిపారు.