Shashi Kapoor No Moreనాలుగేళ్ల ప్రాయంలోనే నాట‌క‌రంగం పై కాలు మోపిన శశిక‌పూర్ ద‌శాబ్దాల పాటు తిరుగులేని న‌టుడిగా బాలీవుడ్ లో త‌న‌దైన మార్క్ వేయ‌గ‌లిగాడు. ఒక ద‌శ‌లో ఆయ‌న‌కు ఎంత డిమాండ్ ఉండేదంటే.. ఆయ‌న ఒప్పుకున్న సినిమాలే వంద‌కు పైగా ఉండేవి. బాలన‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా , నిర్మాత‌గానే కాదు..తొలిత‌రం బాలీవుడ్ న‌టుల్లో ఇంగ్లిషు చిత్రాల్లో న‌టించిన ఘ‌న‌త కూడా ఆయ‌న సొంతం.

కింగ్ ఆఫ్ రొమాన్స్ ..
చుర‌కైన చూపుల్లో అత‌డు ప్రేమ డైలాగులు చెబుతుంటే.. వెండి తెర పై క‌థానాయికే కాదు, థియేట‌ర్ల‌లో అమ్మాయిలు కూడా మైమ‌ర‌చిపోయేవారు. చ‌లాకీగా అత‌డు ప్రేమ గీతాలు పాడుతుంటే ..ప్రేక్ష‌కులు ఉర్రూత‌లూగిపోయోవారు. న‌వ్వితే సొట్ట‌లు ప‌డే బుగ్గ‌ల‌తో అతడి న‌ట‌న‌ను చూసి .. అభిమానులు ఈల‌లు వేసేవారు.

ఇక త‌న త‌రం డ్రీమ్ గాళ్స్ రాఖీ, ష‌ర్మిలా టాగూర్, జీన‌త్ అమ‌న్, హేమ‌మాలిని, ప‌ర్వీన్ బాబీ, మౌస‌మీ చ‌ట‌ర్జీ లాంటి తార‌ల‌తో ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు చిత్రాలు సినీ అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేశాయి. శ‌శిక‌పూర్ రొమాంటిక్ హీరోగా త‌న‌దైన ముద్ర వేశారు. `వ‌ఖ్త్` , `జ‌బ్ జ‌బ్ పూల్ ఖిలే` , `మెహ‌బ్బ‌త్‌,` ఇస్కో కెహ‌తే హై` , `నీంద్ హ‌మారీ ఖ్వాబ్ త‌మ్హారే `రూఠా న క‌రో`సినిమాలు సూప‌ర్ హిట్ అయి ఆయ‌న‌ను తిరుగులేని క‌థానాయ‌కుడిగా మార్చాయి. జ‌బ్ జ‌బ్ పూల్ ఖిలే చిత్రం అల్టీరియా, మొరాకో లిబియా వంటి ఉత్త‌ర ఆఫ్రికా దేశాల్లో కూడా విజ‌య దుందుభి మెగించింది. అల్జీరియాలో ఈ సినిమా రెండేళ్ల పాటు ఆడ‌టం విశేషం.

వెండి తెర అన్న‌ద‌మ్ములు అమితాబ్-శ‌శి
శ‌శి క‌పూర్ ఏకంగా 54 మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల్లో న‌టించారు. అమితాబ్ తో క‌ల‌సి 12 చిత్రాలు న‌టించారు. దీవార్ లో అమితాబ్ -శ‌శి ల న‌ట‌న ఒక‌రికొక‌రు దీటుగా ఉంటుంది. క‌భీ క‌భీ , షాన్, సిల్ సిలా చిత్రాలు ప్ర‌శంస‌లు అందుకున్నాయి. 1979 లో న్యూ ఢిల్లీ టైమ్స్ చిత్రానికి జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు అందుకున్నారు. 2000 లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం ఆయ‌న‌కు అందింది. శ‌శిక‌పూర్ కు రాజేష్ ఖ‌న్నా, అమితాబ్,ధ‌ర్మేంద్ర లాంటి న‌టుల‌తో గ‌ట్టి పోటి ఉండేది. దాన్ని ఆయ‌న సానుకూలంగా తీసుకునే వారు. త‌ప్పితే ఎవ‌రితోను ఆయ‌న‌కు ఎలాంటి విభేదాలు లేవు. అందుకే ఆయ‌న్ని అజాత శ‌త్రువు అంటారు. నేటి త‌రం న‌టులు ఆయ‌న్నీ ముద్దుగా శ‌శి బాబా అని పిలిచేవారు.

శశి క‌పూర్ మ‌న‌కు లెజండ్రీ యాక్ట‌ర్స్ లో ఒక‌రైన స్వ‌ర్గీయ అక్కినేని నాగేశ్వ‌రావు ఎలాగో.. బాలీవుడ్ కు శ‌శి క‌పూర్ అటువంటి న‌టుడు . ఆయ‌న మ‌ర‌ణం నిజంగా సినీ ప్రియుల‌కు తీర‌ని లోటు అన‌డం అతిశ‌యోక్తి కాదు మ‌రి.