CBI MP -YS Avinash Reddyమాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలన్న సీబీఐ నోటీసులను తీసుకోవడానికి వైసీపీ నేత అవినాశ్ రెడ్డి నిరాకరించడం వార్తల్లో నిలిచింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకపోవడం వెనక జగన్ ప్రభుత్వ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరైతే జగన్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే ఉద్దేశంతోనే.. అవినాశ్ రెడ్డిని నోటీసులు తీసుకోకుండా తప్పించుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైయస్ జగన్, అవినాశ్ రెడ్డిలు ఎలాంటి తప్పు చేయలేదని వైసీపీ నాయకులు మీడియా మైకుల ముందు మాట్లాడుతున్నా కానీ అవినాశ్ రెడ్డి ఎందుకు సీబీఐ నోటీసులు అందుకోలేదని ప్రత్యర్థి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఎలాంటి తప్పు చేయని అవినాశ్ రెడ్డి, ఈ కేసులో ఎలాంటి హస్తం లేకపోతే సీబీఐ నోటీసులు అందుకొని, సీబీఐ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని, ఎందుకు భయపడుతున్నారనేది కూడా తేలాల్సిన అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. సీబీఐ విచారణలో ఇప్పటి వరకు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సాక్షాలు, వాంగ్మూలాలు నమోదవుతుండటంతో జగన్ ప్రభుత్వం అయోమయంలో ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పలువురి వాంగ్మూలాలను, ఫోరెన్సిక్ రిపోర్టులను సీబీఐ సంపాదించిన నేపథ్యంలో వైయస్ జగన్ ప్రభుత్వం దీనిపై ఆలోచనలో పడినట్లు టాక్.

ప్రస్తుతానికైతే అవినాశ్ రెడ్డి సీబీఐ నోటీసులు అందుకోకుండా ఉంటే చాలని వైయస్ జగన్ అంతలోపు కొత్త ఎత్తుగడ వేస్తారని రాజకీయ సర్కిల్స్ లో కొన్ని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. కాగా వైయస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ప్రచారం చేసింది అవినాశ్ రెడ్డి అని పలువురు వాంగ్మూలం ఇవ్వడం, వైయస్ వివేకానంద రెడ్డిని ఆస్పత్రికి తరలించి, కొన్ని ఆధారాలను నాశనం చేయడంలో అవినాశ్ రెడ్డి హస్తం ఉందని సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలన్న సీబీఐ నోటీసులను అందుకోవడానికి అవినాశ్ రెడ్డి నిరాకరించగా.. సీబీఐ కడప కోర్టు ద్వారా నోటీసులను పంపించేందుకు సిద్ధమవుతోందట.

అవినాశ్ రెడ్డితో పాటు అతడి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అవినాశ్ రెడ్డికి ఇబ్బందికరంగా.. వైయస్ జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.