cbi raids on raghuram krishnam rajuనరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణం రాజు ఇంటిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో రఘరామకృష్ణంరాజునివాసంలో ఈరోజు ఉదయం నుండి సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన పలువురు అధికారులు ప్రస్తుతం ఆయన రెండు నివాసగృహాలలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలం అయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే బకాయిలు ఎగ్గొట్టి ఆ సొమ్ములు దారి మళ్లించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఒక ప్రముఖ నాయకుడిపై సిబిఐ దాడులు జరగడం ఇదే మొదటి సారి. గతంలో వైఎస్ కు బాగా క్లోజ్ గా మెలిగిన ఆయన తరువాతి కాలంలో జగన్ తో విభేదించి ఆ పార్టీని వీడారు.

ఆ తరువాత బీజేపీ, టీడీపీలలో చేరి ఎన్నికలకు కొంచెం ముంది వైఎస్సార్ కాంగ్రెస్ కు తిరిగి వచ్చి ఆ పార్టీ తరపున నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేశారు. టీడీపీ తరపున కలవపూడి శివ, జనసేన నుండి నాగబాబు ఆయన ప్రత్యర్ధులు. ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసిన ఆయన ఈ ఎన్నికల కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ సీటులో గెలుపు పట్ల అన్ని పక్షాలూ నమ్మకంగా ఉండటం విశేషం. ఎవరు గెలిచారో తెలియాలంటే మే 23 దాకా వేచి చూడాల్సిందే.