Avinash_Reddy_CBI_Investigationవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని శనివారం సీబీఐ అధికారులు సుమారు నాలుగున్నర గంటల సేపు ప్రశ్నించారు. వీడియో రికార్డింగ్ చేయాలని, న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని ఆయన చేసిన అభ్యర్ధనలని సీబీఐ అధికారులు పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి వచ్చి సీబీఐ ఎస్పీ రాంసింగ్ బృందం వివేకా హత్య కేసు గురించి ఎంపీ అవినాష్ రెడ్డిని చాలా లోతుగా ప్రశ్నించింది.

సీబీఐ అధికారులు ఇదివరకు కడపలో పర్యటించినప్పుడు వారికి ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అయితే ఆయనని హైదరాబాద్‌కి రప్పించి విచారణ జరుపుతున్నప్పుడు కూడా డజన్ల కొద్దీ ఆయన అనుచరులు అక్కడికి చేరుకోవడం గమనిస్తే, ఈ కేసు విచారణలో సీబీఐ అధికారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో గ్రహించవచ్చు. వారిని నియంత్రించడానికి భారీగా పోలీసులని మోహరించవలసివచ్చింది.

విచారణ ముగిసిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, “ఈ కేసులో సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాను. వారి సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రయత్నించాను. అవసరమైతే మళ్ళీ విచారణకి రావలసి ఉంటుందని వారు చెప్పారు. ముందుగా సమాచారం ఇచ్చి ఎప్పుడు పిలిచినా వచ్చి వారికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాను. విచారణకి సంబందించిన వివరాలని బహిర్గతం చేయలేను,” అని చెప్పారు.

ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించక మునుపే ఇదే కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తాగిరికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు నలుగురిని ఫిభ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకి హాజరుకావాలని సీబీఐ నోటీసులలో పేర్కొంది.

వారిలో ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప సబ్ జైలులో ఉండగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసు మొత్తం హైదరాబాద్‌కి బదిలీ అయినందున కడప సబ్ జైలులో ఉన్నవారిని హైదరాబాద్‌లోని జైలుకి తరలించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించవచ్చు.