MP YS Avinash Reddyవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకి హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో విచారణకి హాజరు కావలసిందిగా నోటీసులో పేర్కొంది. కానీ మరో 5 రోజుల వరకు తనకి వివిద కార్యక్రమాలున్నందున ఈరోజు విచారణకి రాలేనని 5 రోజుల తర్వాత ఎప్పుడైనా రాగలనని అవినాష్ రెడ్డి జవాబు పంపారు.

సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు అందజేసేందుకు సోమవారం పులివెందులకి వచ్చినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డికి నోటీస్ అందజేసి వెళ్ళిపోయారు.

వివేకా కుమార్తె సునీతా రెడ్డి అభ్యర్ధన మేరకు హత్యకేసు విచారణని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌ 29నా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకి బదిలీ అయిన తర్వాతే తొలిసారిగా సీబీఐ అధికారులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకి హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేశారు.