CBI-High-Court-Of-Andhra-Pradeshఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నెల్లూరు కోర్టులో దొంగతనం కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయించింది. అందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలపడం విశేషం.

మంత్రి కాకాణి ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసుకి సంబందించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను, ఆ వివరాలు భద్రపరిచిన కంప్యూటర్‌ని నెల్లూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి గదిలో నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దొంగతనమయ్యాయి. సాదారణంగా దొంగలు డబ్బు, నగలు లేదా విలువైన వస్తువుల కోసం ఇళ్ళలో దొంగతనాలు చేస్తుంటారు. కానీ అర్దరాత్రి కోర్టులో జొరబడి ఓ కేసుకి సంబందించిన ముఖ్యమైన పత్రాలను, కంప్యూటర్‌ని దొంగతనం చేయడం ఇదే మొదటిసారి కావడంతో అందరూ మంత్రి కాకణి గోవర్ధనే ఈ దొంగతనం చేయించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.

ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు కానీ వారు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని కనుక ఏదైనా స్వతంత్ర సంస్థకు ఈ కేసు దర్యాప్తుని అప్పగించాలని నెల్లూరు జిల్లా న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకి సిఫార్సు చేశారు. దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పికే మిశ్రా బుదవారం విచారణ చేపట్టి ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అందుకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.