CBI Court warns YS Jaganఇప్పటికే కొన్ని వందల కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ స్వాధీనం చేసుకున్నప్పటికీ, తాను అసలు ఎలాంటి అక్రమాస్తులకు పాల్పడలేదని, ఇదంతా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న కుట్రగా తన మీడియా చేత అభివర్ణించే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసు విచారణను వేగంగా ముగించాలన్న నెపంతో ప్రతి శుక్రవారం నాడు కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం వచ్చేపాటికి సీబీఐ కోర్టు ముందు హాజరు కావాల్సిందే.

ఒకవేళ జగన్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే, ముందుగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇటీవల విదేశాలలో చుట్టుముట్టి వచ్చిన సందర్భంలో కూడా ముందుగా కోర్టు నుండి అనుమతులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే నేడు కోర్టు ముందు జగన్, విజయసాయిరెడ్డిలు హాజరు కావాల్సి ఉంది. కానీ వీరిద్దరూ గుంటూరులో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాలలో తలమునకలై ఉన్నారు. ఇదే విషయాన్ని తమ న్యాయవాది ద్వారా కోర్టు వారిని విన్నవించారు.

సదరు అంశాన్ని ప్రస్తావించగానే ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, ‘రాజకీయ కారణాలను సాకుగా చూపి విచారణకు రాకపోవడం సరికాదని తెలుపుతూ, మరోసారి పునరావృతమైతే మాత్రం వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని’ తీవ్రంగా హెచ్చరిస్తూ… తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో కోర్టుకు హాజరు కాని పక్షంలో… మళ్ళీ జైలు గోడలు చవిచూడాల్సి వస్తుందని స్పష్టంగా చెప్పేసింది. దీంతో తదుపరి విచారణకు వస్తే… బెయిల్ పై ఉన్న జగన్ అండ్ కో, అలానే బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతారు.

అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ ఇలా జరుగుతుంటే… మరో వైపు తాజాగా ఈడీ కోర్టు కూడా సమన్లు జారీ చేసింది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆగష్టు 4వ తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ కూడా సమన్లు జారీ అయ్యాయి. ఓ వైపు సీబీఐ కోర్టు… మరో వైపు ఈడీ కోర్టు… పద్మవ్యూహంలో జగన్ చిక్కుకున్నట్లుగా కనపడుతున్నాడు.