CBI court dismisses Jagan pleaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

పైగా అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం తన ప్రతీ కోర్టు హాజరుకు 65 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడంవల్ల అతని కేసులు, సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ వాదనలు వినిపించింది.

జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అందుకే అప్పుడు ఆయనను అరెస్టు చేయడం జరిగిందని, అలాంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఇప్పుడు ఆయన సీఎం అయ్యారన్న ఏకైక కారణంతో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరడం సమంజసం కాదని, చట్టం ముందు అందరూ ఒక్కటే అని కోర్టు అభిప్రాయపడింది. ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు ప్రత్యేకంగా మినహాయింపు పిటీషన్ వేసుకునే అవకాశాన్ని ఇచ్చింది కోర్టు. ఈ తీర్పుతో అధికార పార్టీ నేతలు, అనుయాయులు ఢీలా పడిపోయారు.