tamilnadu-karnataka-fightసుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో నెలకొన్న కావేరీ జల వివాదం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రావణకాష్టంలా రగులుతోంది. అయితే తాజా పరిణామాలపై సుప్రీంకోర్టు తన తీర్పును సవరిస్తూ… మరో ప్రకటన చేసినప్పటికీ, అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తమిళనాడులోని కన్నడిగుల షాపులపై దాడులు జరగగా, కర్ణాటకలో తమిళ వాహనాలను ధ్వంసం చేసారు. తాజాగా ఆ ఆందోళనలు బెంగళూరుకు పాకి, తమిళనాడుకు చెందిన కేసీఎస్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సులకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 35 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు బెంగళూరుతో పాటు, వివిధ ప్రధాన పట్టణాల్లో తమిళులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే రామేశ్వరం, సేలం, చెన్నైలోని కన్నడిగులు నివాసం ఉంటున్న వివిధ ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న పలు లారీలు, బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ మేరకు తమ రాష్ట్ర వాసులకు రక్షణ కల్పించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.