Dr Undavalli Srideviరెండు రోజుల క్రితం దళిత శాసనసభ్యురాలి పట్ల టీడీపీ నాయకులు కుల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు కలకలం రేపాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం జరిగిన ఈ ఘటన మీద ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ వివాదం వేరే మలుపు తీసుకుని శ్రీదేవిని ఇబ్బందుల్లో పడేసేలా కనిపిస్తుంది. ఆ వివాదం తరువాత శ్రీదేవి తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్తులని చెప్పుకొచ్చారు.

శ్రీదేవి తాడికొండ రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆమె దళితురాలు అయితే ఆమె మతం మారగానే తన కులాన్ని, కులం ద్వారా సంక్రమించిన రేజర్వేషన్లను కోల్పోతారు. అంటే ఆమె రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చెయ్యడానికి అనర్హురాలు. ఆమె శాసనసభ సభ్యత్వం తక్షణం రద్దు చెయ్యాలని బీజేపీ మరికొన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలపోటుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా కుల వివక్ష చూపించారని వాదన పైనా వేరే వేరే మాటలు వినిపిస్తున్నాయి. “వినాయక చవితి రోజు మా నియోజకవర్గంలోని అనేక వైఎస్ వర్ధంతి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం అట్టివారు ఇంటికి వెళ్లి స్నానం ఆచరించి వస్తే గానీ దేవుడి కార్యక్రమాలలో పాల్గొనకూడదు. అందుకే ఎమ్మెల్యేను గణేష్ మండపం వద్దకు రానివ్వలేదు తప్ప ఇందులో కులవివక్ష ఏమీ లేదు,” అని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబందించిన వారితో పాటు చంద్రబాబు నాయుడుని కూడా అరెస్టు చెయ్యాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.