cash for vote, chandrababu naidu, KCR, Telangana, Andhra Pradesh,Cash For Vote Scam, YSRCP, Jagan, సరిగ్గా సంవత్సరం క్రితం… తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బలం లేని తెలుగుదేశం, ఎమ్మెల్యేలను కొందామని ప్రయత్నించి ఫోన్ ట్యాపింగ్, వీడియో రికార్డింగ్ సాక్ష్యాలతో దొరికిపోయి ఏడాది గడిచింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్లు ఆఫర్ ఇస్తూ, రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం, ఆపై చంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆడియో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా కేసులో పురోగతి మాత్రం లేదు.

కేసు వెలుగులోకి వచ్చిన కొత్తలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల మధ్య తీవ్ర మాటల యుద్ధమే జరిగింది. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్ వ్యాఖ్యానిస్తే, ఉమ్మడి రాజధానిలో తన ఫోన్ ట్యాప్ చేస్తారా? అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ పంచాయితీ పలుమార్లు గవర్నర్ వద్దకు వెళ్ళిన దరిమిలా, మధ్యవర్తిత్వం జరిపి, ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారన్న వార్తలూ వినిపించాయి. అందువల్లే కేసు నీరు గారిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఓ మారు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చారు. ఆపై కేసీఆర్ కొనసాగించిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కుదేలైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీఆర్ పంచన చేరిపోయారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని గతంలో వెల్లడించిన కేసీఆర్, ఈ కేసుకు సంబంధించినంత వరకూ సర్దుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.