కేసుల మేనేజ్మెంట్.. చంద్రబాబా? జగనా?ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అశేషమైన కేసుల చిట్టా తెలియనిది కాదు. సీబీఐ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు కలిసి దాదాపుగా పదుల సంఖ్యలో కేసులు కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే. వీటి హాజరు కోసం మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ తీర్పు కూడా ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉంది.

గత దశాబ్ద కాలంగా ఇలా జగన్ పై కేసులు నలుగుతుండగా, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ అధినేతను ఎదుర్కొనేందుకు చంద్రబాబుపై కూడా చాలా కేసులున్నాయని, వాటన్నింటిని విచారించకుండా బాబు స్టే తెచ్చుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా గానీ, 2019 ఎన్నికల సందర్భంలో భారీ స్థాయిలో ఈ అంశం ప్రజల్లోకి వెళ్ళింది.

అయితే ఇదంతా అసత్య ప్రచారంగా టిడిపి నేత జివి రెడ్డి కొట్టిపడేసారు. ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన ఓ డిబేట్ లో పాల్గొన్న జివి రెడ్డి, చంద్రబాబుపై అధికార పక్షం చేస్తోన్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. అసలు చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెండింగ్ లో లేవని జివి రెడ్డి చెప్పగా, ఉన్న ఒక్క లక్ష్మి పార్వతి కేసును కూడా ఇటీవల కోర్టు కొట్టివేసిందన్న విషయాన్ని షో నిర్వాహకుడు గుర్తు చేసారు.

ఇదొక అంశమైతే, అసలు కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారంటూ చేస్తోన్న వాదనల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని, ఒకవేళ చంద్రబాబుకు అంత శక్తి ఉండగలిగితే, తన మీద ఉన్న కేసుల కన్నా, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ఒక్కటి క్యాన్సిల్ చేయిస్తే అయిపోతుంది కదా… అంటూ అసలు లాజిక్ ను వెల్లడించారు. దీంతో డిబేట్ లో ఉన్నవారంతా ‘అవును కదా…’ అంటూ నవ్వేశారు.

సాధారణంగా మనీ ల్యాండరింగ్ లో ఈడీ దాఖలు కేసులలో 90 శాతం ఇప్పటికే తీర్పులు వచ్చాయని, ఈ కేసుల యావరేజ్ గడువు 3 సంవత్సరాలకు మించి ఉండదని, కానీ జగన్ కేసు మాత్రం గత పదేళ్లుగా విచారణ జరుగుతూనే ఉందని, దీంతో కోర్టులను ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అన్న ప్రశ్నలను లేవనెత్తారు. లాజిక్స్ తో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ముఖ్యంగా టిడిపి అనుయాయులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఇందులో ఉన్న “లాజిక్”ను హైలైట్ చేస్తున్నారు.