case on TDP leader Aiyanna Patrudu in Supreme Courtఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం “ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టు కేసుల కోసం, ఖరీదైన లాయర్లపై పెడుతున్న ఖర్చుని ఆ సమస్యల పరిష్కారానికి వినియోగిస్తే బాగుండేది. కానీ ఖరీదైన లాయర్లు నియమించుకొని పదేపదే సుప్రీంకోర్టుకి వస్తోంది. ప్రభుత్వం తీరు ఈవిదంగానే కొనసాగితే లాయర్ల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో అడగాల్సి ఉంటుంది,” అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వం వైఖరికి అద్దం పడుతున్నాయి. అందుకు మరో తాజా ఉదాహారణగా టిడిపి నేత అయ్యన్న పాత్రుడి కేసుపై సుప్రీంకోర్టుకి వెళ్ళడం గురించి చెప్పుకోవచ్చు.

అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) సమర్పించారు. అయితే అది నకిలీదని, ఈవో సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ సీఐడీ పోలీసులు ఆయనని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరారు. జలవనరుల శాఖ ఇచ్చే ఎన్ఓసీ ‘వాల్యుబుల్ సెక్యూరిటీ’ కింద వస్తుంది కనుక అటువంటి విలువైన పత్రాన్ని అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

అయితే ఆ పత్రం ‘వాల్యుబుల్ సెక్యూరిటీ’ కింద రాదని చెపుతూ అయ్యన్న పాత్రుడికి రిమాండ్ విధించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఒక ప్రభుత్వం పత్రం గురించి హైకోర్టు ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా సుప్రీంకోర్టుకి వెళ్లాలనుకోవడం న్యాయపరంగా అవివేకమే. అదే విషయం నేడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

అయ్యన్న పాత్రుడి కేసుపై సీఐడీ పోలీసులు దర్యాప్తు కొనసాగించాలంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాది హీరేన్ లాల్ వాదించారు. అయితే దర్యాప్తుకి అనుమతించడం అంటే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించినట్లే అవుతుంది కదా?కనుక ఈ కేసులో రిటర్నబుల్ నోటీస్ ఇస్తామని స్పష్టం చేసింది.

సంక్రాంతి పండుగ సమయంలోనైనా అయ్యన్న పాత్రుడిని జైలుకి పంపించాలనే ప్రభుత్వం తాపత్రయం పడుతున్నట్లుంది. కనుక ఈ కేసు తదుపరి విచారణని జనవరికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది హీరేన్ లాల్ కోరగా దానికీ సుప్రీంకోర్టు నిరాకరించడం విశేషం. ఈ కేసు తదుపరి విచారణని ఫిభ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అంటే అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అయ్యన్న పాత్రుడి జోలికి వెళ్ళలేదన్నమాట!

ఈ కేసులో హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంప పెట్టువంటివే అని భావించవచ్చు. ప్రతిపక్ష నాయకుడిపై రాజకీయ కక్ష సాధించాలనే తాపత్రయంతో వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తోందని అర్దమవుతూనే ఉంది. అంతే కాదు.. అయ్యన్న పాత్రుడు వంటి ప్రతిపక్ష నేతలని సాధించి, వేధించే ప్రయత్నంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళుతూ మొట్టికాయలు వేయించుకోవడం ప్రభుత్వం అప్రదిష్టగా భావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు ఇవ్వలేక ఆపసోపాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కేసుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం న్యాయవాదులకు చెల్లిస్తుండటం గమనిస్తే ప్రతిపక్షాలపై ఎంత కక్షతో రగిలిపోతోందో అర్దం చేసుకోవచ్చు. అందుకే సుప్రీంకోర్టు లాయర్ల ఫీజుల గురించి ఆవిదంగా అన్నట్లు భావించవచ్చు.

రాష్ట్ర ప్రజలు కష్టార్జితంతో పన్నుల రూపేణా చెల్లిస్తున్న ప్రజాధనాన్ని ఇటువంటి కేసుల కోసం ప్రభుత్వం వృధా చేస్తుండటం చాలా బాధాకరమే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినా చెల్లుతుంది. ఒకవేళ రేపు అధికారం కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని ఆలోచించుకొంటే మంచిదేమో?