Cheating-case-Against-Top-Ambitious-Hero-Hrithik-Roshanకల్ట్‌ ఫిట్‌నెట్‌ సెంటర్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్న బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌తో సహా నలుగురిపై కేపీహెచ్‌బీకాలనీ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదయింది.స్థానికంగా ఉన్న ఫిట్నెస్ సెంటర్ బరువు తగ్గడానికి ఏడాదికి రూ.17,490 నుంచి రూ.36,400 వరకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ సంస్థకు బాలీవుడ్‌ సూపర్ స్టార్ హృతిక్‌రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటంతో చాలా మంది భారీగా సొమ్ము చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు.

అయితే పరిమితికి మించి అభ్యర్థులను నమోదు చేసుకోవడంతో వారికి కేటాయించిన సమయాల స్లాట్‌ బుక్‌ కావడం లేదు. దీంతో డబ్బులు చెల్లించిన అనేక మంది తమ డబ్బు తిరిగి ఇవ్వాలని సంస్థను కోరుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. పైగా సిబ్బందిని స్లాట్‌ కోసం నిలదీస్తే సరియైన సమాధానం రావడం లేదు. దీంతో విసుగు చెందిన శశికాంత్‌ అనే బాధితుడు కేపీహెచ్‌బీకాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గట్టిగా నిలదీస్తే తమను జిమ్‌కు రానివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరికొందరు బాధితులు కూడా ఇదే బాట పెట్టనున్నట్టు సమాచారం. పరిమితికి మించి దరఖాస్తులు స్వీకరించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఎండీ, సీఈవో, మేనేజర్‌లతో పాటు సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న హృతిక్‌రోషన్‌పై సైతం చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు నలుగురిపై 420, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా హృతిక్‌ రోషన్ నటించిన సూపర్ 30 సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.