Case against pawan kalyanదేశ సమగ్రత తన ప్రధమ ఆశయంగా చెప్పే ‘జనసేన’ అధినేత దేశానికి ద్రోహం చేసే చర్యలు చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు హైకోర్టు న్యాయవాది జనార్దన్‌ గౌడ్. “కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా సినిమా చూస్తూ గడపాల్సిన సాయంకాల సమయాన్ని ‘దేశభక్తి’ని నిరూపించుకునే పరీక్షకు వేదికగా మార్చడమేంటని, సినిమా థియేట‌ర్ల‌లోనే జాతీయ గీతాన్ని పాడాల‌ని ఎందుకు చెబుతున్నార‌ని” ట్విట్టర్ ద్వారా పవన్ వెలిబుచ్చిన విషయం తెలిసిందే.

ఈ ప్రశ్నలు వేసినందుకు గానూ, దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారంటూ సదరు న్యాయవాది హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దేశ అత్యున్న‌త న్యాయస్థాన‌మైన‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్‌ కల్యాణ్‌ అవమానించారంటూ న్యాయవాది జనార్దన్‌ గౌడ్ పేర్కొన్నారు. దేశ పౌరుల్లో జాతీయ గీత వ్యతిరేక ప్రచారం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ ప‌వ‌న్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ వైఖరిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ ప్రశ్నించింది కేవలం సినిమా హాల్స్ మాత్రమే ఎందుకని అని… రాజకీయ పార్టీల సమావేశాల్లో ఎందుకు జాతీయ గీతాన్ని ఆలపించడం లేదని, చట్టాలు చేసే వారు జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారే తప్ప, సినిమా హాల్స్ లో వద్దని చెప్పలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ పై ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారని మండి పడుతున్నారు. దేశంలో అసలు ద్రోహులను వదిలేసి, పవన్ ను దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయ పడుతున్నారు.