Cartoon on modi rahul gandhiవర్తమాన రాజకీయాలపై వ్యంగ్యంగా ‘కార్టూన్ల’ రూపంలో చెప్పడం కార్టూనిస్ట్ ల పని. ఇలా ఎన్నో కార్టూన్ చిత్రాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. పది మాటలు కన్నా… ఒక్క చిత్ర రూపంలో అంతా అర్ధమయ్యే విధంగా కార్టూన్ బొమ్మలను రూపొందిస్తుంటారు నిపుణులు. ఆ క్రమంలోనే సతీష్ ఆచార్య అనే ప్రముఖ కార్టూనిస్టు మోడీ – రాహుల్ లపై ఒక కార్టూన్ ను గీసారు. భారీ రూపంలో ఉన్న మోడీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ మీద పడుతుంటే… సిద్ధరామయ్య, రాహుల్ గాంధీలు ఒకరికొకరు నన్ను రక్షించమంటే నన్ను రక్షించమని పిలవడం, రాహుల్ వెళ్లి సిద్ధరామయ్య వెనుక దాక్కోవడం ఈ కార్టూన్ ఆంతర్యం.

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్ లో ఈ కార్టూన్ పెద్ద హోర్డింగ్ పై అందరికీ కనపడే విధంగా పెట్టారు. అయితే సదరు చిత్రాన్ని చూసిన స్థానిక కాంగ్రెస్ నేతలు, తన ఉపాధ్యక్షుడుపై ఇలాంటి చిత్రాన్ని పెడతారా అంటూ మండిపడ్డారు. అంతేకాదు, మునిసిపల్ అధికారులతో చెప్పి వెంటనే సదరు కార్టూన్ హోర్డింగ్ ను తొలగించారు కూడా! దీనిపై స్పందించిన కార్టూనిస్ట్ సతీష్, తానూ అన్ని పార్టీల మీద ఇలా కార్టూన్లు వేస్తుంటానని, అయితే ఏ పార్టీ వారు ఇలా తొలగించాలని బెదిరించలేదని తన ఆవేదనను వెలిబుచ్చారు.

తనతో మాట్లాడిన తర్వాత రోజే ఆ హోర్డింగ్ ను మునిసిపల్ అధికారులు తొలగించినట్లుగా సతీష్ పేర్కొన్నారు. అయితే ఒక చిన్న కార్టూన్ కు కాంగ్రెస్ నేతలు ఇంత రచ్చ చేయడంపై రాజకీయ వర్గాలు అవాక్కవుతున్నాయి. బహుశా సదరు కార్టూన్ చిత్రం రాహుల్ వరకు వెళ్లి ఉంటుంది, ఆయన హర్ట్ అవ్వడంతోనే స్థానిక నేతల ద్వారా హోర్డింగ్ ను తొలగించి ఉంటారన్న సమాచారం పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.