CAR, LODGED UNDER SEMITRUCK, DRAGGED ALONG CAJON PASSహాలీవుడ్ యాక్షన్ సినిమాలు “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ట్రాన్స్ ఫార్మర్స్”ల్లోని యాక్షన్ సీన్స్ తరహాలో ఒక రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడమే కాకుండా సుమారు 4 మైళ్లు ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సదరన్ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో మౌంటెన్స్ నుంచి శాన్ గాబ్రియెల్ మౌంటెన్స్ మధ్యనున్న జాతీయ రహదారిపై వెళ్తున్న నిస్సాన్ కారును దాని పక్క నుంచి వెళ్తున్న ట్రక్కు ఓ మలుపులో కుడిచేతి వైపు ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారు డోరు ట్రక్కు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది.

దీంతో ఆ నిస్సాన్ కారును ట్రక్కు సుమారు 4 మైళ్ల దూరం ఈడ్చుకెళ్లిపోయింది. అటుగా వస్తున్న బ్రైన్‌ స్టీమ్కే అనే వ్యక్తి దీనిని చూసి వీడియో తీస్తుండగా, ట్రక్కు డ్రైవర్ ఆపడం లేదు…కొంచెం సాయం చేయండి అని ఆ నిస్సాన్ కారులోని డ్రైవర్ అరవడంతో ఆ ట్రక్కును ఆపేందుకు దూసుకెళ్లారు. ఇంతలో ఆ వ్యక్తి తన కారును ట్రక్కుకు అడ్డం పెట్టి ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే ట్రక్కు చక్రాల్లో ఇరుక్కున్న నిస్సాన్ కారు నుంచి పొగలు వచ్చాయి. అయితే దీనిపై తనకు తెలియదని, దానిని తాను చూడలేదని ఆ ట్రక్కు డ్రైవర్ కూల్ గా సమాధానం చెప్పడం అక్కడి వారికి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతం ఆ వీడియో సర్క్యూలేట్ అవుతోంది.