Ram Charanఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లతో పాటు ఈవెంట్ కోసం గత పది రోజులుగా అమెరికాలోనే ఉన్న రామ్ చరణ్ అక్కడి మీడియాకిస్తున్న ఇంటర్వ్యూలలో చాలా విషయాలే చెబుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి చేరుకోకముందు వరకు ట్విట్టర్ లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగిన రచ్చ అందరికీ గుర్తే. దాని సంగతి పక్కనపెడితే చరణ్ త్వరలో హాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఒక పెద్ద వార్త వింటారని చెప్పాడు. నిర్మాణ సంస్థ దర్శకుడు ఇవేవీ క్లూ ఇవ్వలేదు కానీ మొత్తానికి ఎంట్రీ క్లారిటీ వచ్చింది.

దీనికి నాన్న చిరంజీవికి కనెక్షన్ ఏంటనే పాయింట్ కి వద్దాం. 1998లో మెగాస్టార్ హీరోగా యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఓ ఇంగ్లీష్ మూవీ అట్టహాసంగా మొదలుపెట్టారు. ఇండియన్ వెర్షన్ కి సురేష్ కృష్ణని దర్శకుడిగా తీసుకోగా వెస్ట్ కి భూషణ్ జెర్సేని ఎంచుకున్నారు. భీకరమైన ఫామ్ లో ఉన్న ఏఆర్ రెహమాన్ సంగీతం. టైటిల్ అబూ బాగ్దాద్ గజదొంగ. ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. పత్రికలు దీని వార్తలతో ఊగిపోయాయి. జాతీయ పేపర్లలోనూ విపరీతమైన కవరేజ్ వచ్చింది. షూటింగ్ కొంత భాగం అయ్యేసరికి అనుకోకుండా తీవ్రమైన వివాదాలు వచ్చి పడ్డాయి.

ఒక సీన్ లో ఖురాన్ ని అవమానించారని, మరో సన్నివేశంలో సూర్య భగవానుడిని తప్పుగా చూపించారని ఇలా వివిధ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కాయి. అప్పటికే బడ్జెట్ చేయిదాటిపోయి నిర్మాత కనిపించడం లేదు. ఈ కేసులను ఎదురుకోలేక న్యాయస్థానం ఆదేశాలకన్నా ముందే చిత్రీకరణ ఆపేశారు. అలా అబూ బాగ్దాద్ గజదొంగ బ్రేకులేసుకుని మళ్ళీ లేవనేలేదు. ఇది సరిగా జరిగి ఉంటే టాలీవుడ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ అయ్యేది. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. స్టేట్ మెంట్ అయితే పెద్దదే ఇచ్చాడు కానీ నిజానికి కార్యరూపం దాల్చడం కీలకం.

ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కు విదేశీయుల నుంచి ఎన్ని గొప్ప ప్రశంసలు వచ్చినా రామ్ చరణ్ ని ఏకంగా హాలీవుడ్ మూవీలో హీరోగా చేయించేంత రేంజ్ కు తీసుకెళ్లాయా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పలేం. గతంలో ఇలాగే తొందరపడి బాలీవుడ్ లో జంజీర్ తో అడుగుపెట్టి అవమానింపబడ్డ చరణ్ కు ఆ గాయం నుంచి పూర్తిగా బయటపడి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి దశాబ్దం పట్టింది. మన హీరోలు ఇంటర్ నేషనల్ లెవెల్ లో అడుగులు వేయడం మంచిదే. అది ప్రణాళికబద్దంగా నిర్మాణ సంస్థ దర్శకుడు తదితరాలన్నీ పక్కాగా చూసుకుని అప్పుడు గర్వంగా అనౌన్స్ చేయాలి. ఇలా తేలిగ్గా చెప్పేస్తే తరువాత టార్గెట్ అయ్యే రిస్క్ ఉంది.