Kiran Kumar - Reddy - Congressస్టార్ బ్యాట్సమెన్ అని చెప్పుకుంటూ క్లీన్‌బోల్డ్‌ అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. నాలుగేళ్లనాడు రాజకీయ క్రీడలో తెరమరుగయ్యారు. అజ్ఞాతాన్ని వీడి శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. నాలుగేళ్లుగా స్థానికంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడం, రాజకీయంగా క్రియాశీలకంగా లేని కారణంగా తన సొంత నియోజకవర్గం పీలేరులోనూ ఆయన అనుచరులు అవకాశాలను వెతుక్కుంటూ వివిధ పార్టీల్లో చేరారు.

ఇటీవలే ఆయన సోదరుడు కిషోర్ కూడా తెలుగు దేశం పార్టీలో చేరారు. పీలేరులో కిశోర్‌కు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ పదవి కట్టబెట్టడంతో ఏడెనిమిది నెలలుగా ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో కిరణ్‌ పునరాగమనం ఆయనకు కూడా ఇబ్బందిగానే మారింది.

అధికార పార్టీ కూడా కిషోర్ కు సముచిత హోదా ఇవ్వడంతో కిరణ్‌ పునఃప్రవేశంతో కార్యకర్తలు డోలాయమానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది కిషోర్ వెంటనే ఉంటున్నట్టు సమాచారం. ఇటువంటి సమయంలో సొంత బలగాన్ని కూడా కోల్పోయిన కిరణ్ కాంగ్రెస్ ను కాపాడగలరా అనేది చూడాల్సిన విషయం.