call money issue in vijayawadaకాల్‌మనీ సిండికేట్‌‌తో ప్రమేయమున్న వారిని పోలీసులు వరుసబెట్టి అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. ఎక్కువగా విజయవాడలో 42 కేసులు నమోదు కాగా, 118 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇంచుమించు అన్ని ప్రధాన పార్టీలకు చెందినవారు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా ఈ దందాలో అన్ని పార్టీల వారికి సంబంధం ఉండడం ఆయా పార్టీల నేతలకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎటూ చెప్పలేక ఇరకాటంలో పడుతున్నారు. తమ ప్రతిష్టను మంట గలిపెందుకు అధికార పార్టీ ఈ యవ్వారాన్ని వాడుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది.

అటు- విజయవాడతో పాటు, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం వంటి జిల్లాల్లోనూ ఈ కాల్ మనీ ముఠాల నిర్వాకం బయటపడడం ఖాకీలను కూడా కలవరపరుస్తోంది. అనేక చోట్ల వారు దాడులు జరిపి, వేలాది ప్రామిసరీ నోట్లను, ఇళ్ళ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను మహిళలు కూడా కొనసాగించడం విశేషం. బాధితుల అవసరాలను ఈ ముఠాలు ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు గుంజుతూ వారి ఆస్తులు, ఇళ్ళ పత్రాలను చేజిక్కించుకుని వీధుల పాల్జేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో తాను తీసుకున్న రెండు లక్షలకు గాను 28 లక్షలు చెల్లించినట్టు ఓ బాధితురాలు వాపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినా తనకు ఓ మహిళ నుంచి బెదిరింపులు అందుతున్నాయని ఆమె వాపోయింది. ఒక్కో చోట ఒక్కో పేరు మీద ఈ వ్యవహారం సాగుతున్నా ఇప్పుడిప్పుడే దీనికి అడ్డుకట్ట పడుతోంది.