BV Raghavulu prediction on Janasena Party Elections 2019ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేసిన జనసేన, బీఎస్పీ, వామపక్ష పార్టీల కూటమి పెర్ఫార్మన్స్ పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడారు. కూటమి ఈ ఎన్నికల్లో వివిధ కారణాలతో కొన్ని చోట్ల ప్రభావవంతంగా పనిచేయలేక పోయిందని, దాంతో అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేపట్టిన అభివృధ్ది కార్యక్రమాలు, సంక్షేమం కన్నా స్థానిక ప్రజాప్రతినిధులు అవినీతి ఈ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహించిన తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు రాఘవులు. స్వయంప్రతిపత్తి సంస్థగా, స్వేచ్ఛగా, కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధవంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఏపార్టీ ప్రజా పోరాటాలు చేపట్టినా తాము భాగస్వాములం అవుతామని ఆయన స్పష్టం చేశారు. బీఎస్పీ, వామపక్ష పార్టీలకు పవన్ కళ్యాణ్ దాదాపుగా 50 శాసనసభ సీట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే వారు చాలా చోట్ల కనీస ప్రభావం చూపించలేకపోయారు.

చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం కూడా చెయ్యలేదు. ఆ పార్టీలతో పొత్తు జనసైనికులే జీర్ణించుకోలేకపోయారు. ఆ తరువాత ఆ స్థాయిలో సీట్లు ఇవ్వడం కూడా వారికి మింగుడు పడలేదు. ఆ సీట్లలో కూడా తామే పోటీ చేసి ఉంటే కనీసం మెరుగైన ఓటింగు శాతం నమోదు చేసి ఉండేవారిమి అని వారి అభిప్రాయం. మే23న వచ్చే ఫలితాలలో జనసేన రెండంకెల సీట్లు సాధిస్తే అది గణనీయమైన ఫలితంగానే చెప్పుకోవాలి. అదే గనుక జరిగితే భవిష్యత్తు మీద ఆశ కూడా ఉంటుంది.