ntr-kalyan-ramఓ పక్కన హీరోగా కొనసాగుతూ మరో పక్కన నిర్మాతగా కూడా కీలక పాత్ర పోషిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్, ప్రస్తుతం “ఇజం” సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లుగా సమాచారం. పూరీ మునుపటి చిత్రాలతో పోల్చుకుంటే కాస్త నిదానంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే లభించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో రిజిస్టర్ అయిన ఓ సినిమా టైటిల్ మిక్కిలి ఆసక్తికరంగా మారింది.

“బాక్సర్” పేరుతో రిజిస్టర్ అయిన ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? వంటి పలు ప్రశ్నలు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాను తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారనే సమాచారమే ఈ టైటిల్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముందుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని భావించినప్పటికీ, ‘జనతా గ్యారేజ్’ తర్వాత వక్కంతం వంశీ బరిలో నుండి పక్కకు జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

దీంతో యంగ్ టైగర్ తదుపరి చిత్రం ‘టెంపర్’ దర్శకుడు పూరీతోనే అని, అక్టోబర్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుని, డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ‘బాక్సర్’ టైటిల్ పూరీ కాంపౌండ్ నుండి వచ్చినదేనా? ‘బాక్సర్’గా నటించబోయేది బుడ్డోడేనా? అన్న ఉత్సుకత యంగ్ టైగర్ అభిమానుల్లో నెలకొంది.