Butta_Bomma_Kappela_Remakeమలయాళంలో ఒక సినిమా హిట్టవ్వడం ఆలస్యం క్షణం ఆలస్యం చేయకుండా రీమేకు హక్కుల కోసం పరుగులు పెట్టడం గత రెండు మూడేళ్ళలో బాగా ఎక్కువయ్యింది. పవన్ కళ్యాణ్ అంతటి స్టారే వదలనప్పుడు మనమెందుకు ఊరుకుండాలనే ఆత్రం పెరిగిపోతోంది. ప్రాక్టికల్ గా ఆలోచించడం తగ్గుతోంది. ఆ మధ్య ఇలాగే గీతా ఆర్ట్స్ నాయట్టుని ఫ్యాన్సీ రేటుకి కొంది. దర్శకుడిని లాక్ చేసుకుని క్యాస్టింగ్ మాట్లాడుకుని అడ్వాన్సులు కూడా ఇచ్చేసింది. తీరా బడ్జెట్ లెక్కేసుకుని చూస్తే ఈ కాంబినేషన్ కి సగం కూడా వెనక్కు రాదని అర్థమైపోయింది. దెబ్బకు సైలెంట్ అయిపోయి దాని ఊసే ఎత్తడం లేదు. ఆహాకు డబ్బింగ్ చేసి వదులుతారేమో తెలియదు

తాజాగా బుట్టబొమ్మ వచ్చింది. ఇది కప్పేలా అఫీషియల్ రీమేక్. అరకు దగ్గర ఓ చిన్న ఊళ్ళో చదువుకున్న అమాయక అమ్మాయి(అనీఖా సురేంద్రన్) పొరపాటున ఓ ఆటో డ్రైవర్(సూర్య వశిష్ట)కు రాంగ్ కాల్ ద్వారా పరిచయమవుతుంది. మొహం చూడకపోయినా అతగాడి మాటలకు పడిపోయి కలుసుందామని ఏకంగా వైజాగ్ వచ్చేస్తుంది. తీరా చూస్తే అక్కడ ఆర్కె(అర్జున్ దాస్) తగులుతాడు. ఏ సంబంధం లేని రౌడీ అబ్బాయి ఈ జంట వెంట పడతాడు. దాంతో ఉరుకులు పరుగులు ట్విస్టులు. అసలైన మలుపు క్లైమాక్స్ కు ఓ పావు గంట ముందు ఓపెన్ చేస్తారు. వార్ని అనుకునేలోపు ఓ చిన్న మెసేజ్ ఇచ్చి ఛలో ఇంటికెళ్లిపోండని థియేటర్ లైట్లేస్తారు

నిజానికి బుట్టబొమ్మని కథగా చదువుకుని మెసేజ్ గా అర్థం చేసుకుంటే చాలా మంచి పాయింట్. అందులో డౌట్ అక్కర్లేదు.దాన్ని రెండు గంటలకు పైగా స్క్రీన్ మీద అది కూడా ముక్కుమొహం తెలియని కొత్త హీరో హీరోయిన్లతో చూపించాలంటే మాములు రాత తీత సరిపోదు. దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ టి రమేష్, రచయిత గణేష్ రావూరిలు ఎందుకో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించదు. తేలికైన సన్నివేశాలకు, సాగదీసిన సీన్లకు, చప్పగా సాగే ప్రేమకథలకు ఊగిపోయే ఆడియన్స్ ఎక్కడున్నారు. లొకేషన్ ఫీల్ గుడ్ అనిపిస్తే సరిపోదు. కంటెంట్ లోనూ ఆ భావన కలగాలి. బుట్టబొమ్మలో లేనిది ఇదే.

ఒరిజినల్ ని గెలికితే ఎక్కడ తేడా కొడుతుందోననే భయం మంచిదే కానీ మరీ అతి జాగ్రత్తకు పోయి మన ఆడియన్స్ అభిరుచులు వేరని, కేరళ జనాల్లాగా ఓపిగ్గా చూడరని, వేగం కోరుకుంటారని మర్చిపోతే ఎలా. సరిగ్గా చెప్పాలంటే ఓ ముప్పావు గంటలో ఈ బుట్టబొమ్మ కథని ఆసక్తికరంగా చూపించొచ్చు. కానీ సినిమాగా మలుస్తున్నప్పుడు కాసింత కామెడీ, జనాలకు ఎక్కేలా ఎమోషన్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. లేదంటే ఫస్ట్ హాఫ్ లో కలిగే అసహనం సెకండ్ హాఫ్ లో ఉన్న సానుకూలాంశాలకూ నీరసం తెప్పించేస్తుంది. ఇలాంటి బుట్టబొమ్మలు దూరం నుంచి చూసేందుకు బాగుంటాయి కానీ తీరా ఇంటికి తెచ్చుకున్నాకే వాటిలో డొల్లతనం బయటపడేది