Business Rs320 Cheque -Karan-Johar“యే దిల్ హై ముష్కిల్” సినిమా విడుదలను అడ్డుకోబోమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రకటించడంతో, సదరు సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, ఓ వైపు సినిమా విడుదలకు రెడీ అవుతున్నా… మరో వైపు ధియేటర్ల యాజమాన్యాల నుండి, సామాన్య జనాల నుంచి మాత్రం కరణ్ పట్ల వ్యతిరేకత ఎక్కువవుతూనే ఉంది.

తాజాగా 320 రూపాయల చెక్కును కరణ్ చీమా అనే వ్యాపారవేత్త జోహార్స్ ప్రొడక్షన్ హౌస్ కు పంపించాడు. చెక్కుతో పాటు ఓ లేఖ కూడా పంపిన సదరు వ్యాపారవేత్త, ఎందుకు ఈ చెక్కు పంపానో అంటూ సవివరంగా తెలిపారు. కరణ్ జోహార్… మీరు విడుదల చేసిన వీడియోను చూసి చాలా బాధపడ్డా. సిగ్గుతో తల వంచుకునేలా ఉంది. మీరు, మీ సినిమాలో పని చేసిన వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండు టికెట్ల ఖరీదు అయిన ఈ 320 రూపాయల చెక్ పంపిస్తున్నా.

ఒక బిజినెస్ మ్యాన్ గా మరో బిజినెస్ మ్యాన్ బాధ ఏమిటో నాకు తెలుసు. పాకిస్థాన్ నటులు నటించిన మీ సినిమాను నేను చూడదలుచుకోలేదు. కానీ, మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ చెక్ పంపిస్తున్నా. పాక్ నటులను పెట్టుకుంటే పాకిస్థాన్ లో కూడా బిజినెస్ జరుగుతుంది. అందువల్ల లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనేది మీ ఉద్దేశం. కానీ, పాకిస్థాన్ వల్ల మన దేశంలోని వేలాది మంది నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు… అంటూ లేఖలో కరణ్ చీమా పేర్కొన్నారు.

మరోవైపు, తన సినిమాకు అడ్డంకులు కల్పించవద్దని… సినిమా విడుదల ఆగిపోతే తాను చాలా నష్టపోతానని… సినిమాకు పనిచేసిన వందలాది మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ కరణ్ జోహార్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందనగానే కరణ్ జోహార్ కు చీమా చెక్ పంపించి, కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను అవాక్కు చేసారు.