Namratha and Mahesh Babu family in Burrepalemఒక సాధారణ యువకుడిగా గుంటూరు జిల్లా, బుర్రిపాలెం అనే పల్లెటూరు నుండి బయలుదేరిన ఘట్టమనేని శివరామకృష్ణ అనే వ్యక్తి తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో ‘సూపర్ స్టార్’గా స్థానం పొందారు. అంతేకాదు, తెలుగు సినీ కళామ్మ తల్లికి మహేష్ బాబు రూపంలో మరో ఆణిముత్యాన్ని అందించి, ప్రేక్షకుల గుండెల్లో ‘ప్రిన్స్’గా ముద్రవేసారు. ఇపుడు ఆ ముత్యం తండ్రి పుట్టిన ఊరికి రుణం తీర్చుకోవాలని భావిస్తోంది. “శ్రీమంతుడు” సినిమా విజయం తర్వాత దీనిపై ప్రకటన చేసిన ప్రిన్స్, బుర్రిపాలెం అభివృద్ధి ప్రణాళికలకు ఓ నాలుగైదు మాసాలు సమయం కావాలని అన్నారు.

అయితే ముందుగా చెప్పిన దాని కంటే మరో రెండు మాసాలు ఎక్కువగానే గడిచినప్పటికీ… మహేష్ రాక కోసం బుర్రిపాలెం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఈ రోజు ప్రస్పుటమైంది. ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబ సభ్యులైన భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార, మహేష్ సోదరి పద్మావతి తదితరులు నేడు బుర్రిపాలెంలో పర్యటించడంతో గ్రామంలో తీవ్ర సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు నమ్రత తెలిపారు.

“ఖలేజా” సినిమాలో ఎవరో తెలియని వ్యక్తి తమ ఊరి ప్రజలను ఆదుకుంటాడు… అనే ఆశతో ప్రజలు ఎలా ఎదురు చూసారో… బుర్రిపాలెం గ్రామం కూడా మహేష్ బాబు రాక కోసం వేచిచూస్తుందన్న విషయం అర్ధమైన నమ్రత… “ఈ సారి వచ్చేటపుడు మహేష్ బాబుతో కలిసి వస్తానని” ప్రకటన చేయగానే… ప్రజల నుండి వచ్చిన స్పందన అమోఘం. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు గానీ… చెప్పిన విధంగానే బుర్రిపాలెంను ఒక మోడల్ విలేజ్ గా ప్రిన్స్ తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు.

“సినిమా వాళ్ళు ఇంతే… తమ ప్రచారం కోసం ఏదొకటి చెప్తారు… రాజకీయ నాయకుల మాదిరి ఆ తర్వాత అన్నీ మరిచిపోతారు… ప్రజలు కూడా పట్టించుకోవడం మానేస్తారు…” అన్న విమర్శలకు ప్రిన్స్ మహేష్ బాబు అతీతం అన్న విషయం విమర్శకులకు స్పష్టమైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం… ఏప్రిల్ 23న తిరుపతిలో “బ్రహ్మోత్సవం” ఆడియో విడుదల తర్వాత 24వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెంలో పర్యటిస్తారని తెలుస్తోంది.
Mahesh Babu banner in Burrepalem