Buggana Rajendranath- Reddy-YSCPప్రపంచ బ్యాంక్ రుణం రాకపోవడానికి తాము కారణమని టిడిపి నేతలు దుష్ప్రచారం చేశారని,కాని ప్రపంచ బ్యాంక్ తమ ప్రభుత్వానికి ఏది అవసరమైతే దానికి రుణం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తమకు తెలియచేసిందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్ ఎపి రాజదానిలో జరిగిన అనేక అవకతవకలపై పరిశీలన చేసే పరిస్థితి ఏర్పడడంతో కేంద్రం ఆ రుణాన్ని వద్దని సూచించిందని ఆయన చెప్పారు.

రాజధాని పేరుతో ,భూముల పూలింగ్ పేరుతో అరాచకాలు చేశారని ,వాటిని అందరూ గమనించారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని తమపై నెట్టి తప్పించుకోవాలని టిడిపి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు గ్రాఫిక్స్ తో ప్రజలను చంద్రబాబు మోసం చేసే యత్నంచేశారని ఆయన అన్నారు. ఇదంతా బానే ఉంది. చంద్రబాబు అరాచకాలు ప్రపంచ బ్యాంకు పరిశీలించి పట్టుకుంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు, చంద్రబాబు విరోధైనా మోడీకు మంచిదే కదా.

అటువంటి పరిస్థితే ఉత్పన్నమైతే మోడీ ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుంది? అమరావతిలో అప్పటి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది అని ప్రపంచ బ్యాంకే నిగ్గుతేలిస్తే అది చంద్రబాబు రాజకీయ జీవితానికి ముగింపు అన్నట్టే కదా? అటువంటి అవకాశం మోడీ ప్రభుత్వం వదులుకుంది అంటే ఎవరికైనా నమ్మశక్యం కాదు. కేంద్రం చంద్రబాబుని కాపాడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి చెప్పదలిచారా? రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మారడం వల్లే రుణం ఇవ్వడానికి వెనుకడుగు వేసింది అంటే అది అన్నిటికంటే నమ్మగలిగే కారణంగా ఉందేమో బుగ్గన గారూ?